జీవిత బీమా ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనదే. నేటి కాలంలో బీమా ఆవశ్యకత ఎంతో ఉంది. జీవిత బీమా కుటుంబానికి రక్షణ ఇవ్వడమే కాకుండా పొదుపు చేసే అలవాటును పెంచుతుంది. బీమా తీసుకుని ఉంటే ప్రమాద వశాత్తు మృతి చెందినా మీ పై ఆధారపడిన వారు కనీసం ఆర్థికంగా నైనా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. బీమా తీసుకున్న కాలంలో మృతి చెందితే బీమా పరిహారం అందుతుంది. ఒకవేళ కాలపరిమితి తర్వాత జీవించి ఉంటే మీరు పొదుపు చేసుకున్న మొత్తం మీ చేతికి అందుతుంది. అది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బీమా ప్రీమియం కోసం చెల్లించే మొత్తం తక్కువే ఉంటుంది. కానీ ఈ మొత్తం కలిపితే భారీగా అవుతుంది. దేశంలో బీమా లేని వారి సంఖ్య భారీ స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో బీమా వ్యాపారం వృద్ధికి భారీగా అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
పెద్ద ఎత్తున ప్రచారం
మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహనా కల్పించే నిమిత్తం 2017 సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించినది. 'మ్యూచువల్ ఫండ్స్ సహీ హై' నినాదంతో అప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇది ఎంతగానో విజయవంతం అయింది. మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్టర్లు మళ్లేందుకు ఈ ప్రచారం దోహదపడింది. ఇదే బాటలో ఇప్పుడు జీవిత బీమా కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్సు కౌన్సిల్ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. 24 జీవిత బీమా కంపెనీలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి.

స్థానిక భాషల్లో..
బీమాపై అవగాహనా కల్పించే నిమిత్తం దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో మీడియా ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బంగ్లా తదితర భాషల్లో ప్రచారం జరగనుంది.
నినాదంతో ప్రోత్సహం
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో సరిపోయేంతగా బీమా కవర్ ఉండాలన్నది ఈ నినాదంలో ముఖ్యమైనది. తమ నినాదం ద్వారా దేశంలోని కుటుంబాలను బీమా తీసుకునే విధంగా ప్రోత్సహించనున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో బీమా ప్రాథమిక అవసరం అని బీమా కంపెనీలు చెబుతున్నాయి.
నూతన ప్రీమియంలో 35 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) జీవిత బీమా కంపెనీల నూతన ప్రీమియం వసూళ్లు రూ.1.26 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదేకాలంతో పోల్చింతే ప్రీమియంలో వృద్ధి 35.1 శాతంగా ఉంది.
ఎల్ ఐ సి హవా
జీవిత బీమా రంగంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి ) జోరు కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సంస్థ మొదటి ఏడాది ప్రీమియం రూ.89,980.2 కోట్లు గా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే వృద్ధి 41.7 శాతంగా నమోదైంది.
ప్రైవేట్ బీమా కంపెనీల కొత్త ప్రీమియం వసూళ్లు రూ.35,777.9 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే వృద్ధి 20.9 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications