న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ నెలలో వినియోగదారులకు ఇస్తోన్న ఆఫర్లు గరిష్టస్థాయికి చేరుకున్నాయని, ఈ నెల (అక్టోబర్) తర్వాత ఈ ఆఫర్లు తగ్గే అవకాశముందని మారుతీ సుజుకీ ఇండియా (MSI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా MSI వివిధ మోడల్స్ పైన క్యాష్ డిస్కౌంట్లు, వారంటీ పొడిగింపు ఇస్తోంది. దీంతో జూలై, ఆగస్ట్ నెల కంటే సేల్స్ 18 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి.

భారీ తగ్గింపుకు కార్లు, బైక్‌లు
దాదాపు ఏడాదికి పైగా ఆటో సేల్స్ భారీగా తగ్గిన విషయం తెలిసిందే. దీంతో పండుగ సీజన్‌ను ఉపయోగించుకోవడానికి కంపెనీలు తమ తమ కార్లు, బైక్స్ పైన భారీ మొత్తం తగ్గిస్తున్నాయి. ఒక్కో కారుపై రూ.50,000 నుంచి షరతులపై రూ.4 లక్షల వరకు కూడా తగ్గింపును ప్రకటించాయి. మొత్తంగా భారీ తగ్గింపుతో కార్లు, బైక్స్ చేతికి వస్తున్నాయి. అంతేకాదు, సులభమైన ఈఎంఐ, అతి తక్కువ డౌన్ పేమెంట్ ఆఫర్లు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శశాంక్ శ్రీవాత్సవ స్పందించారు.

ఈ స్థాయి డిస్కౌంట్లు భరించలేం..
ఫెస్టివల్ సీజన్లో కార్లు, బైక్స్ పైన కస్టమర్లకు ఇస్తున్న ఆఫర్లు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయని, ఈ నెల తర్వాత ఈ ఆఫర్లు తగ్గే అవకాశముందని చెప్పారు. ఈ స్థాయిలో డిస్కౌంట్లను భరించే పరిస్థితి లేదన్నారు. ఆఫర్లతో మార్కెట్ పునరుజ్జీవం కోసం ప్రయత్నాలు చేశామని, కానీ ఇలాంటి ప్రోత్సాహకాల్ని ఎక్కువ కాలం కొనసాగించలేమని స్పష్టం చేశారు. త్వరలో ఈ ఆఫర్లు తగ్గే అవకాశముందన్నారు.

బుకింగ్స్ బాగున్నాయి..
గత ఏడాది దసరా, నవరాత్రితో పోలిస్తే ఈసారి బుకింగ్స్ చాలా బాగున్నాయని శశాంక్ తెలిపారు. డీజిల్ మోడళ్లతో పాటు BS 6 ప్రమాణాలతో వచ్చిన ఎనిమిది కార్లు అమ్మకాల వృద్ధికి దోహదపడిందన్నారు. ఇటీవలే విడుదల చేసిన ఎస్ ప్రెసో మోడల్‌కు 10,000కు పైగా బుకింగ్స్ వచ్చాయన్నారు. బీఎస్ 6 మోడల్స్ వచ్చిన నేపథ్యంలో బీఎస్ 4 మోడళ్ల ఉత్పత్తిని నిలిపేశామని చెప్పారు.

ఆఫర్ల ముగిసిన తర్వాత మాత్రమే చెప్పగలం..
ఆఫర్ల నేపథ్యంలో భారీగా సేల్స్ ఉన్నాయని, కానీ ఈ ఆఫర్లు తీసివేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలని శశాంక్ అన్నారు. రాబోవు రోజుల్లో సేల్స్ ప్రభావం ఎలా ఉందో కనిపిస్తుందన్నారు. అప్పుడే ఆటో పరిశ్రమ సేల్స్ ఎలా ఉన్నాయో కచ్చితమైన ప్రకటనలు చేయగలమని చెప్పారు. తద్వారా కేవలం పండుగ సీజన్లోని భారీ ఆఫర్ల ద్వారా జరిగిన సేల్స్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోలేమని, తర్వాత జరిగే సేల్స్‌పై పరిశ్రమ ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, నగదు డిస్కౌంట్స్, ఎక్కువ వారంటీల కారణంగా గత సెప్టెంబరు నెలలో కంపెనీ అమ్మకాలు అంతకు ముందు జూలై, ఆగస్టుతో పోల్చితే 18-20 శాతం మేర పెరిగాయి.


Click it and Unblock the Notifications