వందల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు 'మొండి బకాయిలు' అనే ముద్ర వేసి మాఫీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణాలకు సంబంధించి మొండి బకాయిల రద్దు విషయంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం ఉన్నాయి.
తాజాగా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఓ మీడియా సంస్థ పొందిన సమాచారంలో.. రూ.100 కోట్లు, రూ.500 కోట్లకుపైగా తీసుకున్న రుణాలను రద్దు చేసిన బ్యాంకుల వివరాలు ఉన్నాయి. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బును కార్పొరేట్ వర్గాలకు పందేరం చేసిన బ్యాంకులు తిరిగి వసూలు చేసుకోలేక రద్దు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారీ స్థాయిలో రుణాల రద్దు...
పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు పొందిన కంపెనీలు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో వాటిని ‘మొండి బకాయిలు' పద్దు కింద చేర్చాయి. ఇలా ఆయా వ్యక్తులు, కంపెనీలకు సంబంధించి రూ.2.75 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశాయి. రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తాలను రుణాలుగా పొంది ఆనక తిరిగి చెల్లించకపోవడంతో చివరికి బ్యాంకులు రూ.67,600 కోట్లను మొండి బకాయిలుగా ప్రకటించి రద్దు చేశాయి.

ఒక్క ఎస్బీఐలోనే...
ఇతర బ్యాంకులను విలీనం చేసుకుని దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో భారీ స్థాయిలో ఇలా మొండిబకాయిలుగా మారిన రుణాల రద్దు జరిగింది. మొత్తం రూ.76,600 కోట్ల రుణాలను ఈ బ్యాంకు రద్దు చేసేసింది. ఈ ఒక్క బ్యాంకుకు సంబంధించి 2019 మార్చి 31 నాటికి వసూలుకాని రుణ బకాయిల మొత్తం రూ.37,700 కోట్లు. వీటిలో రూ.100 కోట్లకుపైగా రుణాలు తీసుకుని ఎగవేసిన వ్యక్తులు, సంస్థలు 220 కాగా, రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఏగవేసిన వ్యక్తులు, సంస్థల సంఖ్య 33.

ఏ బ్యాంకులు.. ఏ స్థాయిలో...
ప్రభుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంకుగా పేర్కొనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.76,610 కోట్ల రుణాలను రద్దు చేయగా, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.27,024 కోట్ల రుణాలను రద్దు చేసింది. ప్రైవేటు బ్యాంకుల్లో ఐడీబీఐ ఈ రుణాల రద్దులో ముందు వరుసలో నిలిచింది. ఈ బ్యాంకు రూ.26,219 కోట్ల రుణాలను రద్దు చేసింది. ఇక కెనరా బ్యాంకు రూ.19,991 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.17,440 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.11,653 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.11,083 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.10,308 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ.10,831 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.12,274 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.7,932 కోట్ల రుణాలను మొండి బకాయిలుగా పేర్కొంటూ రద్దు చేశాయి.

సొమ్మొకరిది.. సోకొకరిది...
ప్రభుత్వ.. ప్రైవేటు.. ఏ బ్యాంకులన్నా కానీ.. వాటిలో డబ్బు ఎవరిది? కార్పొరేట్లదా? లేక సామాన్య ప్రజలదా? నిస్సందేహంగా సామాన్యులదే. పాపం.. కూలీ నాలీ చేసుకునే వాళ్లు కూడా తమ సంపాదనలో భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత బ్యాంకుల్లోనే భద్రపరుచుకుంటూ వస్తున్నారు. ఇక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల గురించి చెప్పనక్కర్లేదు. తమ రెక్కల కష్టాన్ని వీరు డబ్బుగా మార్చుకుని అందులో కొంత భాగాన్ని తమ భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకుల్లో అయితే భద్రంగా ఉంటుందని అక్కడ దాచుకుంటున్నారు. కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి? ప్రజల కష్టార్జితాన్ని రుణాల రూపంలో కార్పొరేట్ వర్గాలకు పందేరం చేస్తున్న బ్యాంకులు తిరిగి వాటిని వసూలు చేసుకోలేక చతికిలపడుతున్నాయి.

సామాన్యులకు ‘నామ్ కే వాస్తే'గా...
బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి డబ్బు దాచుకునే సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజానీకం మాత్రం ఆపదొచ్చినా, ఇంకేదైనా అవసరమొచ్చినా బ్యాంకు రుణాలు పొందలేకపోతున్నాయి. పాపం వీళ్లు అడిగేది కూడా తక్కువ మొత్తాలే. పిల్లల చదువు కోసమే, పెళ్లి కోసమో, సొంత ఇల్లు కోసమో, ఆప్తులు ఆసుపత్రిలో చేరినప్పుడో.. తమ వద్ద ఉన్న డబ్బు సరిపోక.. బ్యాంకుల వైపు చూస్తారు. నిజానికి వారి డబ్బుతోనే వ్యాపారం చేసే బ్యాంకులు వారికి చిన్న చిన్న మొత్తాలు ఇవ్వడానికి కూడా నానా అవస్థలు పెడతాయి. నిబంధనల పేరిట నిరుత్సాహపరుస్తాయి. అధవా ఇచ్చినా.. వడ్డీ రూపంలో వీళ్ల ప్రాణాలు తోడేస్తాయి. ఎప్పుడైనా ఒకటి, రెండు ఈఎంఐలు కట్టకపోతే తీవ్రంగా ఒత్తిడి పెడతాయి. రికవరీ ఏజెంట్లను ఇళ్లకు పంపి పరువుతీసే ప్రయత్నాలు చేస్తాయి.

కార్పొరేట్లపై మాత్రం అమిత ప్రేమ...
కానీ ఇవే బ్యాంకులు రుణాలు ఇస్తామంటూ కార్పొరేట్ వర్గాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి. వాళ్లు అడిగిందే తడవుగా నిబంధనలను కూడా తోసిపుచ్చుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రుణాల కింద ఇచ్చేస్తాయి. ఈ వ్యవహారంలో ఆయా బ్యాంకుల అధికారులు, సిబ్బంది చేతివాటం కూడా లేకపోలేదు. కార్పొరేట్ వర్గాలు విసిరే కమీషన్లకు కక్కుర్తిపడి.. ఏమీ చూడకుండానే ఏ స్థాయిలో అధికారులు ఆ స్థాయిలో అందినకాడికి దోచిపెడుతున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ.. ఇలాంటి వ్యక్తులు వందలు, వేల కోట్లలో రుణాలు పొందడం వెనుక బ్యాంకు అధికారుల పాత్ర లేదా? అసలు లేని భూములను కూడా ఉన్నట్లుగా చూపించి రుణాలు ఇస్తున్నాయంటే.. కార్పొరేట్లు, ఉన్నత స్థాయి వ్యక్తుల విషయంలో బ్యాంకుల తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మొండి బకాయిలకు కారణమెవరు?
అసలు మొండి బకాయిలకు కారణమెవరు? అన్న ప్రశ్నకు కార్పొరేట్ వర్గాలవైపు వేలెత్తి చూపుతున్న బ్యాంకులు రుణ వితరణలో తమ తప్పిదాల గురించి ఏం చెబుతాయి? వసూలు చేయడం చేతకాని వారికి రుణ వితరణ చేసే అధికారం ఎక్కడిది? ఇది ప్రజల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు? బ్యాంకులా? రిజర్వ్ బ్యాంకా? కార్పొరేట్ బకాసురులా? లేక వ్యవస్థను ఇంత చక్కగా నడిపిస్తోన్న ప్రభుత్వమా? ఎవరు బాధ్యులు? రుణాల మంజూరులో ఉన్నంత ఆత్రుత.. రుణ గ్రహీతలకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్‌లోగాని, వారు సమర్పించే పత్రాల తనిఖీలలోగాని కనిపించదెందుకు? రుణాల వసూలులో సాధారణ, మధ్యతరగతి ప్రజల పీచమణిచే బ్యాంకులు.. కార్పొరేట్ వర్గాలను మాత్రం ఎందుకు కనికరిస్తున్నాయి? అంత చేతకాని దద్దమ్మలు అసలు బ్యాంకులు స్థాపించడం ఎందుకు? అనే సామాన్యుడి ప్రశ్నకు ఎవరి దగ్గరైనా సమాధానముందా?
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications