హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ ప్రమోటర్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన తోట గురునాథ్ రెడ్డి, హాస్పిటల్ మెజారిటీ స్టేక్ హోల్డర్ అయిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ మధ్య పోరు కొత్తమలుపు తిరిగింది. ఈ హాస్పిటల్‌పై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్న గురునాథ్ రెడ్డికి అరబిందో ఫార్మా ప్రమోటర్లు దన్నుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐహెచ్‌హెచ్ నుంచి వాటా కొనుగోలుకు అవసరమైన నిధులను గురునాథ్ రెడ్డికి.. అరబిందో ప్రమోటర్ కుటుంబం సమకూర్చబోతున్నట్లు సమాచారం. ఒకవేళ అదేగనుక జరిగితే.. వాటా కొనుగోలు తరువాత హాస్పిటల్ నియంత్రణ ఎవరి చేతుల్లో ఉంటుంది. గురునాథ్ రెడ్డి చూసుకుంటారా? అరబిందో ప్రమోటర్లు కేవలం వాటాదారుగానే ఉండిపోతారా? లేక హాస్పిటల్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

‘కాంటినెంటల్'లో ఎవరి వాటా ఎంతెంత?
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 2.95 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాంటినెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుత సామర్థ్యం 300 పడకలు. అయితే ఈ ఆసుపత్రి భవనంలో పడకల సంఖ్యను 750 వరకు పెంచుకునేందుకు అవసరమైన అనుమతులు, సౌలభ్యాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో గ్లెనీగల్స్ డెవలప్‌మెంట్ పీటీఈ లిమిటెడ్ (జీడీపీఎల్)కు 62.23 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా దాని ప్రమోటర్ గురునాథ్ రెడ్డి చేతిలో ఉంది. జీడీపీఎల్ సంస్థ ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ ఆధీనంలోని పార్క్‌వే పంటాయ్‌కి అనుబంధ విభాగం.

ఏమిటీ ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూప్ ఈ ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్. ఇది మలేసియా-సింగపూర్‌లకు చెందినది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద హెల్త్‌కేర్ గ్రూప్. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్ 55 వేల మంది ఉద్యోగులను కలిగి, 16 వేల పడకల సామర్థ్యం కలిగిన 84 కార్పొరేట్ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ తన అనుబంధ విభాగమైన జీడీపీఎల్ ద్వారా 2015 మార్చిలో హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్‌కు చెందిన మెజారిటీ (51) వాటాను రూ.282 కోట్లకు కొనుగోలు చేసింది.

హాస్పిటల్ నియంత్రణ, నిర్వహణలో విభేదాలు...
కాంటినెంటల్ హాస్పిటల్‌లో మెజారిటీ వాటా ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ అధీనంలో ఉండడంతో సహజంగానే నియంత్రణ కూడా దాని చేతుల్లోనే ఉంది. అయితే కొంతకాలానికే హాస్పిటల్ ప్రమోటర్ గురునాథ్ రెడ్డి, ఐహెచ్‌హెచ్ మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2017లో జీడీపీఎల్ తనకు అదనంగా 1.3 శాతం వాటా షేర్లు కేటాయించుకోవడం ద్వారా ఇతరుల వాటాను 47.7 శాతానికి తగ్గించింది. దీంతో ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి. గురునాథ్ రెడ్డి ఈ విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)ని కూడా ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

తప్పుకునే ఆలోచనలో ఐహెచ్‌హెచ్?
2018లో రైట్స్ ఇష్యూలో మరో రూ.140 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఐహెచ్‌హెచ్ గ్రూప్ తన వాటాను 53.13 శాతం నుంచి 62.23 శాతానికి పెంచుకుంది. వాటా పెంచుకున్నప్పటికీ హాస్పిటల్ నిర్వహణ కార్యకలాపాల్లో పలు సవాళ్లు ఎదురవసాగాయి. ఎన్నికోట్లు గుమ్మరించినా.. ఈ హాస్పిటల్ ఇప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రతినెలా రూ.2-3 కోట్ల నష్టాలు తప్పడం లేదు. దీనికితోడు 2017లో కిడ్నీ రాకెట్ బాగోతం ఆరోపణలు కూడా ఆసుపత్రి ప్రతిష్టను కొంత దిగజార్చింది. దీంతో హాస్పిటల్ నుంచి తప్పుకోవాలని ఐహెచ్‌హెచ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్ నియంత్రణ మరొకరి చేతుల్లోకి వెళ్లకుండా ప్రమోటర్ గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

రంగంలోకి అరబిందో ఫార్మా ప్రమోటర్లు....
కాంటినెంటల్ హాస్పిటల్ నియంత్రణ గురునాథ్ రెడ్డి చేతుల్లోకి రావాలంటే మెజారిటీ వాటా ఆయనకు ఉండాలి. ఉండాలంటే.. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ గ్రూప్ చేతుల్లో ఉన్న మెజారిటీ వాటాను కొనేయాలి. అందుకు కోట్ల రూపాయలు కావాలి. సరిగ్గా ఇక్కడే గురునాథ్ రెడ్డికి అరబిందో ఫార్మా ప్రమోటర్లు దన్నుగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఐహెచ్‌హెచ్ నుంచి వాటా కొనుగోలుకు అవసరమైన నిధులను అరబిందో ప్రమోటర్లు సమకూర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ రూ.600 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మెజారిటీ వాటా అరబిందో ప్రమోటర్లు గనుక కొంటే మరి ఆసుపత్రి నిర్వహణ గురునాథ్ రెడ్డి చూస్తారా? లేకపోతే దానిని అరబిందో గ్రూప్ తన చేతుల్లోకి తీసుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే!


Click it and Unblock the Notifications