10 రోజుల్లో రూ.2,000 నోట్లు రద్దు, రూ.1000 నోట్లు రిలీజ్: ఇదో తప్పుడు ప్రచారం
అప్పుడప్పుడు కొన్ని అర్థంపర్థంలేని విషయాలు గుప్పుమంటుంటాయి. ఇవి ప్రజలను భయాందోళకు గరి చేస్తుంటాయి. కరెన్సీ నోట్లు చెల్లవని, కాయిన్స్ తీసుకోవద్దని... ఇలా అసత్య ప్రచారాలు చేస్తుంటారు. తాజాగా, అలాంటి ఒక మెసేజ్ వైరల్‌గా మారింది.

రూ.2000 నోట్లు అక్టోబర్ 10 తర్వాత చెల్లవని తప్పుడు సందేశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000నోట్లని వెనక్కి తిరిగి తీసుకుంటోందని, వీటిని పది రోజుల్లో అదీ రూ.50,000 మాత్రమే మార్పిడీ చేసుకునే వెసులుబాటు ఉందని, దయచేసి మీ వద్ద ఉన్న రూ.2000 నోట్లను వెంటనే మార్పిడీ చేసుకోవాలని, 10 అక్టోబర్ 2019 తర్వాత మీరు మీ రూ.2000 నోట్లను మార్చలేరని ఓ సందేశం తెగ వైరల్ అయింది. తద్వారా అక్టోబర్ 10వ తేదీ నుంచి రూ.2000 నోటు చెల్లదని వదంతులు లేవనెత్తారు.

సోషల్ మీడియాలో వైరల్
ఈ సందేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది ఎంతోమందిని కలవరానికి గురి చేసింది. అయితే ఇది తప్పుడు ప్రచారం. సెంట్రల్ బ్యాంకు రూ.2000 నోట్లను వెనక్కి తీసుకునే ప్లాన్ ఏదీ చేయలేదు. అలాగే, ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్‌లోను అందుకు సంబంధించిన అంశాలు ఏవీ కూడా లేవు.

ఏం చేసినా వెబ్ సైట్లో ఉంటుంది...
అంతేకాకుండా, ప్రముఖ వెబ్ సైట్ క్వింట్‌తో ఆర్బీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారట. రూ.2000 నోటు వెనక్కి తీసుకుంటున్నట్లు తమ వైపు నుంచి (ఆర్బీఐ) ఎలాంటి నోటిఫికేషన్ లేదని, ఆర్బీఐ ఏం చేయదలుచుకున్నా అవన్నీ అధికారిక వెబ్ సైట్లో కనిపిస్తాయని, దయచేసి ఇలాంటి వదంతులు నమ్మవద్దని తెలిపారు.

రూ.2000 తొలగించి రూ.1000 తీసుకు వస్తుందని ప్రచారం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1-జనవరి-2020 నుంచి రూ.1000 నోట్లను విడుదల చేస్తుందని, రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటోందని, మీ వద్ద ఉన్న రూ.2000 నోట్లను రద్దు చేసుకోవడానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉందని (అక్టోబర్ 10వ తేదీ వరకు, కానీ ఫేక్) మెసేజ్‌లు ఉన్నాయి.

వదంతులు ఇదే మొదటిసారి కాదు...
ఆర్బీఐ విషయంలో వదంతులు ప్రచారం చేయడంలో ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్ 26న పీఎంసీ బ్యాంకు సంక్షోభం తర్వాత ఆర్బీఐ తొమ్మిది బ్యాంకులను మూసివేస్తున్నట్లు వదంతులు వచ్చాయి. కానీ అది ఉత్తిదే అని తేలింది. గతంలోను పలు వదంతులు వినిపించాయి.


Click it and Unblock the Notifications