భారీగా పెరిగిన బంగారం ధర, మూడేళ్ల కనిష్టానికి దిగుమతులు
బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. ఇటీవలి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది. ఈ ప్రభావం భారత్ పైన పడింది. పండుగ సీజన్ కావడం కూడా ఓ కారణం. ఎంసీఎక్స్‌లో ఉదయం సెషన్‍లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.423 లేదా 1.1 శాతం పెరిగి రూ.38,315గా ఉంది. కిలో వెండి ధర 1.75 శాతం పెరిగి రూ.45,636గా ఉంది. ఆగస్ట్ నెలలో బంగారం రికార్డ్ హైకి చేరుకుంది. ఆ తర్వాత కాస్త తగ్గుతూ వచ్చింది.
సెప్టెంబర్ ప్రారంభంలో ముంబైలో బెంచ్ మార్క్ గోల్డ్ ఫ్యూచర్స్ 22 శాతం పెరిగి రూ.39,885 ($561)గా ఉంది. కొనుగోళ్లు తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్ మందగమనం, ధరలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు.. వంటి కారణాలు ఉన్నాయి.
మన మార్కెట్ విషయానికి వస్తే బంగారం ధర ఆల్‌టైం గరిష్ట స్థాయి నుంచి దిగిరావడంతో పండుగ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కూడా పెరిగి అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కదలాడుతున్నాయి. గత నెలలో ఔన్స్ బంగారం 1550 డాలర్లుకు పైకి చేరుకుంది. అమెరికా - చైనా ట్రేడ్ వార్ ముగుస్తున్న సంకేతాలు వంటి వివిధ కారణాల వల్ల ఆ తర్వాత 1500 డాలర్ల దిగువకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో 1500 డాలర్లకు పైకి కనిపిస్తోంది.
స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,498.91 డాలర్లుగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1,504.80గా ఉంది. బంగారంతో పాటు ఇతర విలువైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 887.70 డాలర్లుగా ఉంది. వెండి ఔన్స్ 0.2 శాతం పెరిగి 17.58డాలర్లుగా ఉంది. పల్లాడియం ఔన్స్ 1,687.48 డాలర్లుతో నిలకడగా ఉంది.
మూడేళ్ల కనిష్టానికి దిగుమతులు
బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు అత్యవసరం అయితే తప్ప కొనుగోలు చేయడం లేదు. దీంతో సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. 2016 జనవరి నెల తర్వాత మళ్లీ దిగుమతులు కనిష్టస్థాయికి చేరుకోవడం ఇదే. ఆగస్ట్ నెలలో 14.8 టన్నులు, సెప్టెంబర్ నెలలో 13.5 టన్నులు దిగుమతి అయింది.


Click it and Unblock the Notifications