నిజాం నిధుల కేసులో బ్రిటన్ హైకోర్టులో పాకిస్తాన్‌కు చుక్కెదురు కాగా, భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. లండన్‌లోని నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ అయిన నిధులు ఇండియాకు చెందుతాయని బుధవారం హైకోర్టు తీర్పు చెప్పింది. నాడు నిజాం వేసిన మొత్తం ఇప్పుడు దాదాపు 35 రెట్లకు పైగా పెరిగింది. ఈ మొత్తం భారత్‌కే చెందుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

35 రెట్లు పెరిగిన ధనం
1948వ సంవత్సరంలో నిజాం నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ తన బ్యాంకు ఖాతా నుంచి 10,07,940 పౌండ్లను బ్రిటన్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ పేరిట బదిలీ చేశారు. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.8.82 కోట్లకు పైగా అప్పుడు బ్యాంకులో వేశారు. నాడు బ్రిటన్ హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హబీబ్ ఇబ్రహీం రహీమతుల్లా ఖాతాలోకి బదలీ చేశారు. అప్పటి నుంచి ఆ మొత్తం బ్యాంకులో ఉండిపోయింది. ఇప్పుడు ఆ డబ్బు వడ్డీతో కలిపి ఎన్నో రెట్లు పెరిగి 3.5 కోట్ల పౌండ్లకు చేరుకుంది. అంటే మన కరెన్సీలో రూ.306.50 కోట్లు.

ఆయుధాల కోసం నిధులు...
ఈ నిధులు తమకు దక్కాలని 7వ నిజాం వారసురాలు ప్రిన్స్ ముఖర్రంజా, ఆయన సోదరుడు ముఫఖంజా, భారత ప్రభుత్వం కలిసి కేసు వేశారు. పాకిస్తాన్ కూడా ఆ మొత్తం తమకే చెందాలని దశాబ్దాలుగా వాదించాయి. భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అందుకే భారత్‌కు, నిజాం వారసులకు ఆ నిధులు దక్కరాదని పాకిస్తాన్ కోర్టులో వాదించింది. 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకునే సమయంలో నాటి నిజాం నవాబ్ తమను తాము కాపాడుకునేందుకు ఆయుధాలు సరఫరా చేయాలని కోరుతూ ఆ మొత్తాన్ని తమకు చెల్లించాడని పాకిస్తాన్ తెలిపింది. అయితే హైదరాబాద్ సంస్థానం విలీనానికి, ఈ నిధుల కేసుకు ఎటువంటి సంబంధం లేదని భారత్ పేర్కొంది. భారత్ వాదనతో జడ్జి ఏకీభవించారు.

ఆయుధాల కొనుగోలు ప్రస్తావన లేదు...
తన పేరిట 10,07,940 పౌండ్లను నిజాం బదలీ చేసినట్లు నాటి పాకిస్థాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీమతుల్లా అంగీకరించారు. మీరు పేర్కొన్న సొమ్మును నా పేరిట భద్రపరిచేందుకు అంగీకరిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. కానీ ఎక్కడా ఆయుధాల కొనుగోలు ప్రస్తావన లేదు. ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు లేవని జడ్జి పేర్కొన్నారు. అంతేకాదు, పాక్ హైకమిషనర్‌కు బదలీ చేసిన నిధులను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని కూడా నిజాం నవాబు బ్యాంకును కోరారట.

నాటికి పసిబాలుడు.. నేడు 80 ఏళ్లు
తమ ముత్తాత తమకు వారసత్వంగా వదిలి వెళ్లిన ఆ మొత్తాన్ని ఎనిమిదో నిజాం (ముకరంజా), ఆయన సోదరుడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని, కానీ పాకిస్థాన్ గత ఏడు దశాబ్దాలుగా అడ్డుకుందని, కానీ ఆ నిధులపై ఎనిమిదో నిజాంను కోర్టు హక్కుదారుగా గుర్తించిందని, ఈ వివాదం మొదలైనప్పుడు తన క్లయింట్ ముకరంజా ఇంకా పసిబాలుడు అని, ఇప్పుడు ఆయన వయస్సు 80 దాటిందని, ఆయన జీవించి ఉండగా కేసు పరిష్కారం కావడం హర్షణీయమని నిజాం వారసుల లాయర్ పాల్ హెవిట్ అన్నారు. కాగా, బ్రిటన్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్‌కు నిజాం వంశస్థులు సహా ఏడుగురు ఇతరులకు మధ్య సాగిన ఈ కేసులో భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి ప్రతివాదులుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications