గుడ్‌న్యూస్: బ్యాంకులకు వరుసగా సెలవుల విషయంలో కస్టమర్లకు గుడ్‌న్యూస్! ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో వివిధ ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫీసర్స్ చేయతలపెట్టిన సమ్మె వాయిదా పడింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ నుంచి హామీ లభించటంతో ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు అధికారుల సమాఖ్యలు ప్రకటించాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య (AIBOA), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్‌తో సమాఖ్యలకు ఈ ప్రతినిధులు భేటీ అయ్యారు. వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసారు. దీంతో సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించారు. సమ్మె విరమణ నేపథ్యంలో బ్యాంకు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
మెగా బ్యాంకుల విలీనం ప్రకటనతో పాటు ఇతర సమస్యలు పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని యూనియన్ నాయకులు తెలిపారు.
ఇదిలా ఉండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనానికి సంబంధించి ఆయా బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు ఖాతాదారులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ జె పాకిరి సామి, కార్పొరేషన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ పీవీ భారతి, యూబీఐ ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విలీనం కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. బ్యాంకు కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు.


Click it and Unblock the Notifications