భారీగా పెరిగిన బంగారం ధర, బలహీనపడిన రూపాయి
బంగారం ధర సోమవారం నాడు పెరిగింది. గత వారం పసిడి ధర తగ్గుముఖం పట్టగా పండుగ సీజన్, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్‌లో 0.6 శాతం పెరిగి రూ.37,950గా ఉంది. వెండి ధర మాత్రం ఎక్కువగానే పెరిగింది. ఇది 1.75 శాతం పెరిగి కిలోకు రూ.47,277గా ఉంది. గత శుక్రవారం పసిడి ధర నెల రోజులలో కనిష్టానికి పడిపోయి 10 గ్రాములకు రూ.37,438గా ఉంది. ఈ రోజు రికవరీ అయింది. బంగారం ధర రూ.500 వరకు పెరిగింది.
గత ట్రేడింగ్‌లో రూపాయి 70.94 పైసల వద్ద ముగిసింది. ఈ రోజు రూపాయి కాస్త బలహీనపడి 71.08 వద్ద ఉంది. ఈ ప్రభావం బంగారంపై ఉంటుంది. బంగారం ధర పెరిగినప్పటికీ గత నెలలో రికార్డ్ హై రూ.39,885 కంటే రూ.2,000 తక్కువగానే ఉంది. వెండి గత నెల రికార్డ్ హై రూ.51,489 కంటే రూ.4,200 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.1 శాతం పెరిగి 1,518.33 డాలర్ల వద్ద ఉంది.

కాగా, ఇటీవల పసిడి ధరలు పైకి, కిందకు అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఒడిదుడుకులు ఎదురైనా సమీపకాలంలో ఇది పటిష్టమేనని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-చైనా ట్రేడ్ వార్ అనిశ్చితులు, సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల నేపథ్యంలో భౌగోళికంగా పరిస్థితుల కారణంగా పెట్టుబడులకు బంగారం వైపు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications