హైదరాబాద్: ఆటో రంగంలో భారీ మందగమనం ఉంది. ఆటో సేల్స్ వరుసగా పదో నెల కూడా తగ్గిపోయాయి. ఆగస్టు నెలలో భారీగా సేల్స్ తగ్గాయి. దీంతో ఆటో కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. చాలామంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన వాహనాలు స్టోర్‌లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహన కంపెనీలు విక్రయాలు పెంచుకునేందుకు వినూత్న విధానాలకు తెరలేపుతున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా రిటైల్ కొనుగోలుదారుల కోసం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సర్వీసును ప్రారంభించింది.

నెలసరి చందా రూ.19,720 నుంచి మొదలు.. హైదరాబాద్‌లోనూ..
నెలవారీ చందా పద్ధతిలో తమ వాహనాలను వినియోగదారులకు ఇచ్చేందుకు మహీంద్రా కంపెనీ ముందుకు వచ్చింది. ఈ స్కీంను తొలి దశలో హైదరాబాదు, పుణే, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చండీగఢ్, అహ్మదాబాద్ నగరాల్లో అమలు చేస్తున్నారు. వినియోగదారులకు నెల సబ్‌స్క్రిప్షన్ రూ.19,720 నుంచి ప్రారంభమవుతుంది.

స్కీం కింద ఈ కార్లు..
మహీంద్రా కేయూవీ100, ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 500స్కార్పియో, టీయూవీ300, మరాజో, అల్తురస్ జీ4 వాహనాలను ఈ స్కీం కింద ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం మహీంద్రా అండ్ మహీంద్రా సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ ప్లాట్ ఫామ్ రెవ్‌తో జత కట్టింది. కొత్త కార్లయితే ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఈ స్కీం కింద వాహనం పొందవచ్చును.

వినియోగదారులకు ప్రయోజనాలు
వినియోగదారులు ముందస్తుగా పెద్ద మొత్తాన్ని చెల్లించవలసిన అవసరం లేదు. వాహనం అద్దెకు తీసుకునేవారు నెలకు ఎంత మొత్తమైతే ఉంటుందో అంత చెల్లిస్తే చాలు. అలాగే, రీఫండబుల్ డిపాజిట్ కూడా కొంత చెల్లించాలి. వినియోగదారులకు డౌన్ పేమెంట్, రోడ్డు ట్యాక్స్ భారం ఉండదు. నెలవారీ నిర్వహణ వ్యయం మాత్రం కొంత ఉంటుంది. ఈ కార్లను ఎంతకాలం ఉపయోగించుకుంటారో అంతకాలం ఉపయోగించుకొని, ఆ తర్వాత తిరిగి ఇచ్చివేయవచ్చు.

వాహనం కొనకుండానే నచ్చినంత కాలం...
ఇక, వాహన రీసేల్‌కు సంబంధించిన రిస్క్ ఉండదు. కస్టమర్ చెల్లించే మొత్తంలోనే బీమా, రొటీన్ మెయింటెనెన్స్ వ్యయాలు కలిగి ఉంటాయి. కనీస కాలపరిమితి ముగిసిన తర్వాత కస్టమర్ తాను వినియోగించుకున్న వాహనం తిరిగి ఇచ్చి, మరో వాహనం కూడా తీసుకోవచ్చు. లేదా తాను తీసుకున్న వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. వాహనం కొనకుండానే నచ్చిన కారును అందుబాటు ధరలో నచ్చినంత కాలం నడుపుకోవచ్చు.

వీరంతా పొందవచ్చు..
ఈ సదుపాయాన్ని మిలీనియల్స్‌తో పాటు సొంతగా ఉపాధి పొందుతున్న వారు, ఎస్ఎంఈలు, స్వల్పకాలానికి వాహనాలు అవసరం ఉన్నవారు వినియోగించుకోవచ్చునని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ డివిజన్ సేల్స్, మార్కెటింగ్ చీఫ్ విజయ్ రామ్ నక్రా తెలిపారు. ప్రస్తుతం 8 నగరాల్లో సేవలు అందిస్తుండగా, రానున్న మూడు నెలల్లో ఈ సేవలను 11 నగరాలకు విస్తరించనున్నారు.

ఏ కారుకు ఎంత ధర అంటే?
ఈ కింది కార్ల నెలసరి సబ్‌స్క్రిప్షన్ ముంబైలో ఇలా ఉన్నాయి...
- Mahindra KUV100 NXT - Rs.19,720
- Mahindra TUV300 - Rs.25,870
- Mahindra XUV300 - Rs.26,230
- Mahindra Scorpio - Rs.31,230
- Mahindra Marazzo - Rs.34,860
- Mahindra XUV500 - Rs.37,840
- Mahindra Alturas G4 - Rs.87,390


Click it and Unblock the Notifications