సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమలవుతోంది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానా పడుతోంది. బైక్ పైన వెళ్తుంటే రూ.23 వేల జరిమానా, ఆటో డ్రైవర్‌కు రూ.44 వేల జరిమానా, ట్రక్కు డ్రైవర్‌కు రూ.86వేల జరిమానా అంటూ వార్తలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు విదేశాల్లోను ఇలాగే భారీగా జరిమనా విధిస్తారు. భారత్‌లోను ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

ఫోన్ యాప్ ద్వారా...
ఈ నేపథ్యంలో వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్ సహా కావాల్సిన అన్ని పత్రాలను తమ వెంట తీసుకు వెళ్తున్నారు. తమ వెంట అన్ని పత్రాలు ఉంచుకున్నప్పటికీ ఏదో ఒక డాక్యుమెంట్ పొరపాటున మిస్ అయ్యే అవకాశముంది. కాబట్టి దానిని అధిగమించేందుకు మీ వద్ద ఉన్న ఫోన్‌నే డాక్యుమెంట్స్ లాకర్‌గా ఉపయోగించుకోవచ్చు. మీ చేతిలో ఫోన్ ఉండి, యాప్స్ ఉంటే వాటిలో దాచుకోవచ్చు.

డిజిలాకర్, ఎం-పరివాహన్
సంబంధిత పత్రాలను ఆన్‌లైన్ ఫార్మాట్‌లో ఫోన్లో భద్రపరుచుకొని అవసరం వచ్చినప్పుడు చూపిస్తే భారీ జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. డిజిలాకర్, ఎం-పరివాహన్ ద్వారా డాక్యుమెంట్స్ చూపించవచ్చునని రవాణాశాఖ సీనియర్ అధికారులు చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రజలు తమ వద్ద ఉన్న కీలక పత్రాలను ఆన్ లైన్‌లో భద్రపరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిజి లాకర్‌ను తీసుకు వచ్చింది. ఇందులో మన వాహనం తాలూకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సురెన్స్ వంటి వివిధ పత్రాలను దాచుకోవచ్చు.

డిజిలాకర్
ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డిజి లాకర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్, OTPతో లాగిన్ కావాలి. ఇందులోని అప్ లోడ్ సెక్షన్‌నుఉపయోగించి మీ డాక్యుమెంట్స్‌ను అప్ లోడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయగానే మీకు ప్రభుత్వం నుంచి జారీ అయిన పత్రాలన్ని ఆటోమేటిక్‌గా అందులో కనిపిస్తాయి.

ఎం-పరివాహన్
వెహికిల్స్ కోసం ఎం-పరివాహన్ తీసుకు వచ్చింది. ఇందులో వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు పొందుపరుచుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఎం-పరివాహన్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. కాంటాక్ట్ నెంబర్‌తో ఈ యాప్‌లోకి లాగిన్ కావొచ్చు.


Click it and Unblock the Notifications