ఈ హోటల్లో ఆర్టికల్ 370 ఆఫర్: ఏపీ-తెలంగాణ బిర్యానీ, గోంగూర ప్రత్యేకం
ఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం గత నెలలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశం భారత అంతర్గత విషయం. కానీ పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా మార్చే ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఈ విషయం పక్కన పెడితే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బంపరాఫర్ ప్రకటించింది. 'Article 370 తాలి' పేరుతో అన్ని రాష్ట్రాల రుచులను అందిస్తోంది. అయితే ఇది కేవలం జమ్ము కాశ్మీర్ వాసులకే.

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో రెస్టారెంట్
మీరు జమ్ము కాశ్మీర్‌కు చెందినవారైతే ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ఆర్టోర్ 2.1 రెస్టారెంట్ అన్ని రాష్ట్రాలకు చెందిన రుచులను అందించే సూపర్ సైజ్ తాలి (భోజనం) పైన రూ.370 తగ్గింపును అందిస్తోంది. ఈ రెస్టారెంట్ వివిధరకాల వంటకాలకు ప్రసిద్ధి. ఈ రెస్టారెంటుకు వెళ్లి జమ్ము కాశ్మీర్ వచ్చినట్లుగా ప్రభుత్వ ఐడీ చూపిస్తే స్పెషల్ భోజనంపై రూ.370 ఆఫర్ లభిస్తోంది.

వెజ్, నాన్ వెజ్ తాలి
ఇక్కడ వెజ్ తాలీ ధర రూ.2,370, నాన్-వెజ్ తాలీ ధర రూ.2,669. ట్యాక్స్‌లు అదనం. వెజ్ మెనూలో కాశ్మీరీ పులావ్, ఖమీర్ కీ రోటీ, నద్రూకి షామీ, దుమ్ ఆలో, ఖాహ్వా వంటి జమ్ము కాశ్మీర్ ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ మెనూలో కాశ్మీరీ పులావ్, ఖమీర్ కీ రోటి, నద్రూకి షామి, రోగాన్ జోష్, ఖాహ్వా ఐటమ్స్ ఉన్నాయి.

ఏపీ, తెలంగాణల నుంచి బిర్యానీ, గోంగూర పచ్చడి
ఈ ఆర్టికల్ 370 తాలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెజ్ తాలీ అయితే వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ తాలి అయితే చికెన్ బిర్యానీ ఉంది. తెలంగాణ నుంచి వెజ్, నాన్ వెజ్‌కు గోంగూర పచ్చడి ఉంది. ఢిల్లీకి చెందిన పన్నీరు బట్టర్ మసాలా, చికెన్ బట్టర్ మసాలా, తమిళనాడుకు చెందిన బీన్ అండ్ క్యాబేజీ పోరియాల్, చికెన్ చెట్టినాడ్, కర్ణాటకకు చెందిన బిస్బిల్లా బాత్, మటన్ పెప్పర్ ఫ్రై, కేరళకు చెందిన రసం.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక ఐటమ్స్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications