పెట్రోల్, డీజిల్ వాహనాలపై నితిన్ గడ్కరీ శుభవార్త
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే ప్రణాళికలు ఏమీ లేవని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం మరోసారి వెల్లడించారు. ఆటో ఇండస్ట్రీ గత కొన్నాళ్లుగా తీవ్ర మందగమనంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం ఉంటుందనే ఆందోళన అందరిలోను నెలకొంది. ఆటో సేల్స్ తగ్గిపోవడానికి ప్రపంచ మార్కెట్, ఇతర కారణాలతో పాటు ఇదీ ఒ కారణం. ఈ నేపథ్యంలో గడ్కరీ మరోసారి స్పష్టత ఇచ్చారు.

అలాంటి ప్లాన్ ఏదీ లేదు
ఆటో సేల్స్ మందగమనం కారణంగా పలు కంపెనీలు ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి. ఉద్యోగులను తొలగించాయి. డీలర్లు తమ షాప్స్ మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించే ప్రణాళిక లేదని ఇదివరకు కూడా ఆయన చెప్పారు.

స్క్రాపేజ్ విధానం
ప్రభుత్వం వెహికిల్ స్క్రాపేజ్ విధానం తీసుకు వస్తుందని గడ్కరీ తెలిపారు. హైబ్రీడ్ వెహికిల్స్ పైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) తగ్గింపును కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. బలహీనమైన సేల్స్ నేపథ్యంలో అగ్రశ్రేణి వాహనతయారీదారులు కూడా ఉత్పత్తులు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఈ రంగాన్ని తోవలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం నిర్మల ఆయా పరిశ్రమల వర్గాలతో చర్చిస్తున్నారు.

నిర్మల ఊరట
ఆటో సేల్స్ రంగం పునరుద్ధరణ కోసం నిర్మల ఇంతకుముందే ఊరటనిచ్చే ప్రకటనలు చేశారు. గవర్నమెంట్ డిపార్టుమెంట్స్ కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి అనుమతివ్వడం వంటి ప్రకటనలు చేశారు. మార్చి 31, 2020 వరకు కొనుగోలు చేసే ఆటోమొబైల్స్‌కు ఊరటనిచ్చారు. సేల్స్ తగ్గడానికి ఆర్థిక మందగమనంతో పాటు ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం కూడా ఓ కారణం.


Click it and Unblock the Notifications