ఝున్‌ఝున్‌వాలాకు షాక్, దెబ్బకు రూ.200 కోట్ల ఆస్తి మటాష్
ముంబై: మార్కెట్ పరిచయస్తులకు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తూ ఆయన కోట్లకు పడగలెత్తారు. అలాంటి ఆయన కూడా జీడీపీ వృద్ధి రేటు మందగమనం, ఆర్థిక మందగమనం నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయన ఆస్తులు రూ.200 కోట్ల వరకు క్షీణించాయి. ఆయన ఈక్విటీ పోర్ట్ పోలియోలోని ప్రధాన షేర్ టైటాన్ మంగళవారం ప్రారంభంలోనే 3 శాతానికి పైగా పతనమైంది. దీంతో ఆయన ఆస్తి ఏకంగా కొద్ది నిమిషాల్లోనే రూ.200 కోట్లు క్షీణించింది.

వృద్ధి మందగమనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆభరణాల విభాగ ఆదాయం లక్ష్యాలను చేరుకోవడం కష్టమని టైటాన్ ప్రకటించింది. అలాగే, గడియారాల విభాగం ఆదాయ అవకాశాలు అంతగా ఉండవని అభిప్రాయపడింది. వృద్ధి మందగనం కారణంగా గడియారాలకు డిమాండ్ తగ్గవచ్చునని కంపెనీ తెలిపింది. టైటాన్ వాచెస్‌కు 50 శాతం మార్కెట్ ఉంది.

రాకేష్, భార్యకు కలిసి 7.05 శాతం షేర్లు
మంగళవారం నాడు కంపెనీ షేర్ 3.95 శాతం నష్టపోయి రూ.1,061.25 వద్దకు జారింది. ఇటీవలే జూలై నెలలో రూ.1,345తో 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసిన టైటాన్ షేర్లు స్వల్పకాలంలో 20 శాతం పైగా క్షీణించింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలానే కాదు ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా కూడా టైటాన్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇరువురికి కలిపి కలిపి 7.05 శాతం వాటా ఉంది. ప్రస్తుతం వారి వాటా రూ.6,700 కోట్లకు తగ్గింది.

పండుగలపై ఆశలు
టైటాన్‌కు ఆభరణాల వ్యాపారం కీలకం. అదే సమయంలో 2019 ఆర్థిక సంవత్సరంలో గడియారాల సేల్స్ 13 శాతం (రూ.2,441)గా ఉన్నాయి. ఆభరణాల విభాగంలో 20 శాతం లక్ష్యం రిస్క్‌గానే ఉందని ఇటీవల టైటాన్ తెలిపింది. రానున్నది పండుగల సీజన్ కాబట్టి మార్కెట్ బాగుంటుందని ఆశిస్తున్నారు.

ఏడాదిలో 81 శాతం తగ్గిన DHFL
మరోవైపు, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) ఏడాదిలో ప్రకారం 81 శాతం కోల్పోయింది. DHFL రుణ సంక్షోభం, ద్రవ్య కొరత సమస్యల్లో చిక్కుకుంది. ఏడాది క్రితం రూ.600 ఎగువన ట్రేడ్ అయిన ఈ షేరు ఇప్పుడు రూ.50 కంటే దిగువన ఉంది.

దెబ్బకొట్టిన ఎస్కార్ట్
ఎస్కార్ట్స్ షేర్లు కూడా రాకేష్‌ను దెబ్బకొట్టాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఈ షేర్ 3.64% క్షీణించి రూ.491.70 వద్ద ఉంది. ఆగస్టులో కంపెనీ ట్రాక్టర్ విక్రయాలు 19% తగ్గడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఏడాది కాలంలో ఈ షేరు ధర మూడోంతులు తగ్గింది.


Click it and Unblock the Notifications