ఆర్బీఐ ఊహించని నిర్ణయం, కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్ల బొనాంజా
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగులు రూ.1.76 లక్షల కోట్ల నిల్వల్ని కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్సుఫర్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నిర్ణయించింది. మిగులును తమకు ఇవ్వాలని కేంద్రం ఎన్నాళ్ల నుంచో కోరుతోంది. ఇప్పుడు ఆర్బీఐ కేంద్రానికి భారీ బొనాంజా ఇచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఈ మేరకు నివేదిక ఇవ్వగా, దీనికి ఆమోదం తెలిపింది. రికార్డ్ స్థాయిలో కేంద్రానికి ఇచ్చేందుకు అంగీకరించడం గమనార్హం.
రూ.1,76,051 కోట్లు కేంద్రానికి ఇవ్వనుంది. ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ECF) గుర్తించిన రూ.1,23,414 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరంలోని మిగులు కాగా, ఎక్సెస్ ప్రొవిజన్స్ రూ.52,637 కోట్లు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదలీ చేయనున్నట్లు కేంద్ర బ్యాంకు ప్రకటనలో తెలిపింది.

ఆర్బీఐ మిగులును పెద్ద మొత్తంలో భారత ప్రభుత్వానికి బదలీ చేయడం ఊహించమని పరిణామం అని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి కొంత ఆర్థిక పరిపుష్టి లభిస్తుందని, అధిక వృద్ధి రేటును చేరుకునేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
జలాన్ కమిటీ తన నివేదికను ఆర్బీఐ గవర్నర్‌కు సమర్పించింది. వివిధ అంశాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది కమిటీ. సెంట్రల్ బ్యాంకు ఆర్థిక స్థితిస్థాపకత, చట్టబద్ధమైన నిబంధనలు, ఆర్బీఐ పబ్లిక్ పాలసీ మాండేట్, రిస్క్.. తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని కమిటీ ఈ మేరకు రికమెండ్ చేసినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఆర్బీఐ వద్ద స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన మిగులు నిధులు ఉన్నాయి. అంటే రూ.9 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రామాణికమైన 14 శాతంతో పోలిస్తే ఆర్బీఐ వద్ద రెండింతలు ఉంది. ఆర్బీఐ మిగులు నిధుల నిర్వహణ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, మిగులు నిధుల్లో నుంచి రూ.3 నుంచి రూ.4 లక్షల కోట్లు కేంద్ర ఖజానాకు బదలీ చేయాలని ఆర్థిక శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ఎంత పరిమాణంలో మిగులు నిధులు ఉండవచ్చుననే అంశాన్ని జలాన్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను అందించింది.


Click it and Unblock the Notifications