FPIలకు భారీ ఊరట, సర్‌చార్జ్ ఉపసంహరించుకుంటున్నాం: నిర్మల
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ (FPI)లకు భారీ ఊరట ఇచ్చారు. శుక్రవారం నాడు సాయంత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
భారత్‌లో ఆర్థిక మందగమనంపై వస్తున్న ఆందోళనలపై ఆమె స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామని తెలిపారు. సంస్కరణలు అనేవి నిరంతరం జరుగుతాయన్నారు. 2014 నుంచి సంస్కరణలు అజెండాగా పని చేస్తున్నామన్నారు. గత అయిదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామన్నారు.

పన్ను విధానాల్లోనూ సంస్కరణలు తెచ్చామన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. భారత్ త్వరితంగా వృద్ధి రేటు నమోదు చేస్తోందన్నారు. ఆదివారం జీఎస్టీ అధికారులతో సమావేశమవుతామని, జీఎస్టీని మరింత సులభతరం చేస్తామని తెలిపారు. భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి మొదలవుతాయన్నారు. పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు ఉండవన్నారు.
ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అలాగే ఉంది. దాదాపు అన్ని రంగాలు ఆర్థికమాంద్యం భయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు, శుక్రవారం ఉదయం నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. సాయంత్రం నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తున్నారని తెలియడంతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications