ప్రభుత్వాన్ని రూ.2,500 కోట్ల ఫండింగ్ కోరిన ఎయిరిండియా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కేంద్రం నుంచి అత్యవసర సాయం కోరుతోంది. వెంటనే రూ.2,500 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కంపెనీకి దాదాపు రూ.60,000 కోట్ల రుణాలు ఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాకు రూ.7,600 కోట్ల రూపాయల సమీకరణకు కేంద్రం సావరీన్ గ్యారంటీకి ఆమోదం తెలిపింది.
కేంద్రం ఈ మొత్తానికి ఆమోదం తెలిపిందని, తాము రూ.5,000 కోట్ల రుణాన్ని సేకరించామని, రూ.2,464 కోట్లు మిగిలి ఉందని, ఈ మొత్తాన్ని తమకు రుణంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ఆర్థిక పనితీరు చాలా బాగుందని, తాము ఆరోగ్యకరమైన లాభాల వైపు పయనిస్తున్నామని, వైమానిక రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ, ఎయిరిండియా పరిస్థితి బాగుందని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.29,000 కోట్ల రుణాలని తగ్గించుకున్నామని, ఇది ఉపశమనం కలిగించే అంశమని తెలిపారు.
కాగా, ఎయిరిండియాకు గురువారం షాక్ తగిలిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం నుంచి దేశీయంగా ఉన్న ఆరు విమానాశ్రయాల్లో ఇంధన సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. పాత బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇంధన సరఫరా నిలిపేసినట్లు ఓ అధికారి తెలిపారు. అయినప్పటికీ విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయని, వీటిపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. కాగా, కంపెనీలు కొచ్చి, విశాఖ, మొహాలీ, రాంచీ, పుణె, పాట్నా ఎయిర్ పోర్టుల్లో ఇంధన సరఫరా నిలిపివేశాయి.


Click it and Unblock the Notifications