చైనాలో 20లక్షల ఉద్యోగాలు పోతాయ్, నేనే కారణం!: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: టారిఫ్‌తో డ్రాగన్ దేశానికి చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చైనాలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కోల్పోతాయని జోస్యం చెప్పారు. తమ అదనపు సంకాలతో పాటు తన కఠిన విధానాల వల్ల డ్రాగన్ కంట్రీలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతాయన్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పేలవంగా ఉందన్నారు.

ఉద్యోగాలను కాపాడుకునేందుకు ఆ సొమ్ము వెదజల్లుతోంది
తప్పుడు ద్రవ్యవిధానాలతో ఆ దేశం ఇన్నాళ్లు ఎన్నో ప్రయోజనాలు పొందిందని ట్రంప్ అన్నారు. ఇప్పుడు ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆ సొమ్మునే వెదజల్లుతోందని చెప్పారు. ఇన్నాళ్లు టారిఫ్స్ వంటి కారణాలతో సముపార్జించిందన్నారు. కానీ ఇప్పుడు తన విధానాలు, నిర్ణయాల వల్ల త్వరలోనే రెండు మిలియన్ల ఉద్యోగాలు కోల్పోనున్నారని చెప్పారు.

ఏం జరుగుతుందో వేచి చూద్దాం
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చైనా కోరుకుంటోందని ట్రంప్ అన్నారు. గత కొన్ని నెలలుగా ఇరుదేశాల ప్రతినిధులు ఈ మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. ఏం జరుగుతుందో వేచి చూద్దామని, కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం తప్పకుండా ఒప్పందం చేసుకోవడానికి చూస్తోందని చెప్పారు.

అందుకే కంపెనీలు చైనాను వీడుతున్నాయి
చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌తో ఇటీవల మాట్లాడారనే అంశంపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇన్నేళ్లలో వారు (చైనా) తన హయాంలో అత్యంత దయనీయ పరిస్థితిని చూస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. 25 శాతం టారిఫ్ చెల్లించేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదని, అందుకే చైనాను వీడుతున్నాయన్నారు. చర్చల కోసం చైనా ముందుకు రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

టారిఫ్ రూపంలో చైనా భారీగా తిన్నది
తాము సుంకాలు వేయడం లేదని, చైనా మాత్రం అధిక సుంకాలు వేస్తోందని ట్రంప్ అన్నారు. సుంకాలు బాగా పని చేస్తాయని తనకు అర్థమైందన్నారు. ఇప్పటి వరకు చైనా టారిఫ్ రూపంలో భారీగా తిన్నదన్నారు. పలు దేశాలు కూడా టారిఫ్ అధికంగా విధిస్తున్నాయని చెప్పారు. ఈ విషయంలో అమెరికా గతంలో కంటే బలంగా ఉంటుందని చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనీస్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications