న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు, అసంఘటిత కార్మికులకు, చిరు వ్యాపారులకు వివిధ రకాల పథకాలు, ప్రయోజనాలు ప్రవేశపెడుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులకు ఊరట కల్పించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు కార్పోరేట్ అపైర్స్ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్ వివరాలు వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఫ్రెష్ స్టార్ట్ నిబంధనలకు లోబడి....
అప్పుల ఊబిలో కూరుకుపోయిన చిరువ్యాపారులకు దివాళా స్మృతి చట్టం (IBC-ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్) కింద రుణమాఫీ ప్రణాళికను ప్రకటించేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లుగా శ్రీనివాస్ వెల్లడించారు. దివాలా స్మృతి చట్టం కింద ఉన్న 'ప్రెష్ స్టార్ట్' నిబంధనలకు లోబడి ఈ రుణాలను రద్దు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు.

ఒత్తిడిలో ఉన్న రుణగ్రహీతల అప్పుల రద్దుకు చర్చలు
ఆర్థికంగా బలహీనవర్గాలకు చెంది(EWS), ఒత్తిడిలో కూరుకుపోయిన చిన్న రుణగ్రహీతల అఫ్పుల్ని రద్దు చేసేందుకు, అర్హతా ప్రమాణాల కోసం మైక్రో ఫైనాన్స్ పరిశ్రమతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దీనిని వ్యక్తిగత దివాలాలో భాగంగా అమలు చేయాలని కేంద్ర చూస్తోందని చెప్పారు. EWS విభాగంలో ఉండి ఒత్తిడిలో కూరుకుపోయిన వారికి మాత్రమే వర్తించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఫ్రెష్ స్టార్ట్ సౌలభ్యం ప్రమాణాలు...
ఒకసారి ఫ్రెష్ స్టార్ట్ సౌలభ్యాన్ని ఉపయోగిస్తే మళ్లీ అయిదేళ్ల వరకు ఈ అవకాశముండదని చెప్పారు. దేశవ్యాప్తంగా మూడు నాలుగేళ్ల వ్యవధిలో ఇవి రూ.10,000 కోట్లకు మించి ఉండవన్నారు. దివాలా చట్టం కింద ఫ్రెష్ స్టార్ట్ కింద వివిధ పరిమితులకు లోబడి రుణగ్రహీతల స్థూల వార్షికాదాయం రూ.60,000 మించరాదు. రూ.20,000 లోపు ఆస్తిని కలిగి ఉండాలి. రుణ పరిమాణం రూ.35,000కు మించరాదు. సొంత నివాస యూనిట్ ఉండకూడదు.

మైక్రోఫైనాన్స్ అభ్యంతరాలు
చిరువ్యాపారుల రుణ మాఫీకి సూక్ష్మ రుణ పరిశ్రమ పలు అభ్యంతరాలు లేవనెత్తిందని, దీనిపై చర్చలు సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చిరువ్యాపారులకు ఊరటనిచ్చే క్రమంలో.. మైక్రోఫైనాన్స్ పరిశ్రమ దెబ్బతినకుండా కూడా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇబ్బందులు పడుతున్న చిన్న రుణగ్రహీతలకు ఊరటనివ్వాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమని చెప్పారు.


Click it and Unblock the Notifications