ఆ హోటల్లో 2బాయిల్డ్ ఎగ్స్ రూ.1,700, చికెన్ కోటీశ్వరులకు మాత్రమే!
న్యూఢిల్లీ/ముంబై: ఇటీవల చండీగడ్‌లోని జెడబ్ల్యూ మారియట్ హోటల్లో రెండు అరటిపళ్లకు రూ.442 బిల్లు వేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. షూటింగ్‌లో భాగంగా నటుడు రాహుల్ బోస్ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. 2 అరటి పళ్లకు రూ.442.50 బిల్లు వేయడంతో అతను అవాక్కయ్యారు. దీనికి సంబంధించి అతను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో చండీగఢ్ ఎక్సైజ్, పన్నుల శాఖ కమిషనర్ విచారణ చేపట్టారు. హోటల్‌కు రూ.25,000 జరిమానా విధించారు. ఇది మరిచిపోకముందే దానిని మించిన ఘటన వెలుగుచూసింది. కేవలం రెండు బాయిల్డ్ గుడ్లకు రూ.1,700 బిల్లు వేశారు.
హై-ఎండ్ ఫోర్ సీజన్స్ హోటల్‌లో
ముంబైలోని హై-ఎండ్ ఫోర్ సీజన్స్ హోటల్‌లో కేవలం రెండు బాయిల్డ్ ఎగ్స్‌కు రూ.1,700 బిల్లు వేశారు. ఈ మేరకు కార్తీక్ ధర్ అనే ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన బిల్లును పోస్ట్ చేశారు. ముంబైలోని ఫోర్ సీజన్ హోటల్‌లో రెండు ఎగ్స్‌కు రూ.1,700 బిల్లు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆమ్లెట్స్‌కు కూడా
ఆ బిల్లులో ఉన్న ప్రకారం రెండు ఆమ్లెట్స్‌కు కూడా రూ.1,700 బిల్లు వేశారు. డైట్ కోక్ రూ.260, కోక్ జోరీ రూ.260, ఫుడ్ రూ.5,100గా ఉంది. మొత్తం రూ.6,989.40 బిల్లు అయింది. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించవలసి ఉంది.

చికెన్ అత్యంత ధనవంతులకు మాత్రమే...
ఈ ట్వీట్ పైన నెటిజన్లు స్పందించారు. 'దీనిని బట్టి చూస్తే చికెన్ కేవలం అత్యంత ధనవంతులు మాత్రమే తినగలరు', 'కోళ్లు బంగారు గుడ్లు పెట్టాయా', 'ఇది నాకు అర్థం కాలేదు. ఇలా ఎవరు తింటారు', 'బాయిల్డ్ ఎగ్స్ ధరలు ఆమ్లెట్ ధరలతో సమానంగా ఉన్నాయి. ఇవే ఏమైనా ప్యారిస్ నుంచి బాయిల్ చేసి తీసుకు వస్తున్నారా', 'కేవలం మూడు ఎగ్స్, మూడు ఆమ్లెట్‌లకే రూ.5,100. ఈ డబ్బులతో సంవత్సరమంతా తింటాను' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications