మార్కెట్లపై ఆర్బీఐ రెపో రేటు కట్ ప్రభావం...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తారని చాలామంది భావించారు. కానీ ఊహించని విధంగా 35 బేసిస్ పాయింట్స్ తగ్గడంతో 5.75 శాతం నుండి 5.40 శాతానికి తగ్గింది. రెపో రేటు తగ్గిన అనంతరం స్టాక్ మార్కెట్లు ఎత్తుపల్లాలు చవిచూశాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు తగ్గి 36,956 వద్ద ఉండగా, నిఫ్టీ 10,951 వద్ద ఫ్లాట్‌గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా మన మార్కెట్లపై కనిపించాయి. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.12 శాతం లాభపడింది. డాలర్ మారకంతో రూపాయి విలువ పడిపోవడంతో ఐటీ ఇండెక్స్ లాభాల్లో ట్రేడ్ అయింది.

మరోవైపు, కీలక వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో బ్యాంకుల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో నష్టాల్లోకి వెళ్లింది. ఆర్బీఐ రేట్ల కోత విధింపు నేపథ్యంలో తిరిగి లాభాలబాట పట్టాయి. ప్రయివేటు రంగ బ్యాంకులకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభించింది.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం రెపో రేటును 35 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో రెపో రేటు 5.75 శాతం నుంచి 5.40 శాతానికి వచ్చింది. రెపో రేటు తగ్గడం వల్ల రుణాలపై వడ్డీ భారం మరింత తగ్గనుంది. మందగమన వృద్ధి రేటు నుంచి ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేసే ఉద్దేశ్యంలో భాగంగా రెపో రేటును తగ్గించింది.

దీంతో ఈ ఏడాది వరుసగా నాలుగోసారి రెపో రేటును తగ్గించినట్లు అయింది. గత మూడు పర్యాయాలు 35 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ఈసారి 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. నేడు ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది మూడో పరపతి సమీక్ష సమావేశం. స్వల్ప కాల రుణ వడ్డీ రేటు దీంతో 5.40 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. జీడీపీ వృద్ధి రేటును 6.9 శాతానికి తగ్గించింది.
ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు ప్రస్తుత వడ్డీ రేట్ల తగ్గింపు ఉపకరిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ అప్పు రూపంలో బ్యాంకులకు ఇచ్చే మొత్తంపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి వడ్డీ రేట్లు చాలా కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వాహన విక్రయాలు మందగించడం, మౌలిక రంగం వృద్ధి దిగజారడం, రుతుపవనాలు, స్టాక్ మార్కెట్ల క్షీణతపై ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించింది.
ఆరుగురు సభ్యుల MPCలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, రవీంద్ర హెచ్ ధోలాకియా, మైఖేల్ దెబబ్రత పాత్రా, బిభు ప్రసాద్ కనుంగోలు 35 బేసిస్ పాయింట్స్‌కు ఓటు వేయగా, చెతన్ ఘతే, పమీ దువాలు 25 బేసిస్ పాయింట్స్‌కు ఓటు వేశారు. ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటు 110 బేసిస్ పాయింట్స్ తగ్గింది.


Click it and Unblock the Notifications