కార్లే కాదు.. ఈ స్కూటర్ల ధరలు కూడా రూ.8,600 వరకు తగ్గాయి
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇటీవల జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతున్నాయి. ఇటీవల కొన్ని ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.80,000 వరకు తగ్గాయి. అలాగే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు కూడా తగ్గాయి.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఒకినవా స్కూటర్స్ తమ ఉత్పత్తుల ధరల్ని రూ.8,600 వరకు తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఒకినావా లీడ్ యాసిడ్ రేంజ్ స్కూటర్ల ధరలు రూ.2,500 నుంచి 4,700 వరకు, లీ అయాన్ రేంజ్ స్కూటర్ల ధరలు రూ.3,400 నుంచి 8,600 వరకు తగ్గించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఒకినవా ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ.37,000-రూ.1,08,000 ధరల్లో ఉన్నాయి.
ఇటీవలే విద్యుత్ వాహనాలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆ మేరకు తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. దీని వల్ల విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే వారిపై భారం మరింత తగ్గనుంది. ఫలితంగా వాహనాల అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కార్ల ధరలు ఇలా తగ్గాయి..
టాటా మోటార్స్ తన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ టిగోర్ ధరను రూ. 80,000 వరకు తగ్గించింది. ఇప్పటిదాకా ఈ మోడల్ ధర ఫేమ్ 2 సబ్సిడీ లేకుండా రూ.12.35- 12.71 లక్షలుగా ఉండేది. తాజా తగ్గింపుతో ధర రూ. 11.58-11.92 లక్షలకు తగ్గింది. ఫేమ్ సబ్సిడీ ఉన్నప్పుడు పాత ధర రూ. 10.99-11.09 లక్షలు ఉండగా కొత్త ధర రూ. 9.96-10.30 లక్ష్యాలకు చేరుకుంది. ఈ ధరలు ఎక్స్ షోరూమ్ ముంబై కి చెందినవి. ఎలక్ట్రిక్ టిగోర్లో కంపెనీ మూడు వేరియంట్లను అందిస్తోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా తన ఈ-వెరిటో ధరను రూ. 80,000 తగ్గించింది. దీంతో దీని ధర రూ. 10.71 లక్షలకు (ఫేమ్ ప్రయోజనాలు, ఆన్ రోడ్, ఢిల్లీ ) చేరుకుంది. త్రీవీలర్ ట్రియో ధర రూ. 20,000 వరకు తగ్గించింది. దీని ధర రూ. 2.05 లక్షల నుంచి ప్రారంభం (ఆన్ రోడ్ ) అవుతుంది.


Click it and Unblock the Notifications