కాశ్మీర్ టెన్షన్, ఊగిసలాడుతున్న షేర్ మార్కెట్లు
ముంబై: ఇండియన్ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు మార్కెట్లకు జమ్ము కాశ్మీర్ టెన్షన్ భయం పట్టుకుంది. సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. అంతకుముందు గం.11.19 నిమిషాలకు సెన్సెక్స్ 621 పాయింట్లు (1.67 శాతం) నష్టపోయి 36,497 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 10,812 (1.68) శాతం కోల్పోయింది.
మార్కెట్లు నష్టాల్లో ఉండటానికి అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు జమ్ము కాశ్మీర్ ఉద్రిక్తతలు కారణం. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, వేదాంత, ఎస్బీఐ, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, రిలయన్స్, మారుతీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత పడిలేస్తూ ట్రేడ్ అవుతున్నాయి. ఓ సమయంలో 10,800కు దిగజారిన నిఫ్టీ, మధ్యాహ్నం 10,900కు చేరుకుంది. సెన్సెక్స్ 500 పాయింట్ల నుంచి 700 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
జమ్ము కాశ్మీర్‌కు సంబంధించి నాలుగైదు రోజులుగా టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. అయితే సోమవారం ఆర్టికల్ 370 రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.
మరోవైపు, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్ 370(3)తో జమ్ము కాశ్మీర్ లెజిస్లేటీవ్ అసెంబ్లీగా మారుతుంది. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపించే అవకాశముంది.


Click it and Unblock the Notifications