భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి). ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎంత కుగ్రామం లోకి వెళ్లి అడిగినా ఈ సంస్థ పేరు చెబుతారు. 63 ఏళ్ల కాలంలో అంతగా విస్తరించింది ఈ ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థ తన పాలసీ దారులకు ఎంతో భరోసాను కల్పిస్తోంది. అనేక సంస్థలను తన నిధుల ద్వారా ఆడుకుంటోంది. ఇప్పుడీ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ సంస్కరణల్లో భాగంగా ఎల్ ఐ సి లిస్టింగ్ ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది.

బీమా రంగంలో..
* దేశీయ బీమా రంగంలో ఎల్ఐసి మార్కెట్ వాటా మూడింట రెండు వంతులు ఉంది.
* ఈ సంస్థను పబ్లిక్ లిస్టింగ్ చేయాలంటే ఎల్ఐసి చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుందట. దీనికి సంబంధించిన న్యాయపరమైన అభిప్రాయాలను తీసుకుంటోందట ప్రభుత్వం.
* ఈ సంస్థ లిస్టింగ్ వల్ల కలిగే మంచిచెడులను గురించి ప్రభుత్వ విభాగాలు ఆలోచన చేస్తున్నాయి.
* దీర్ఘకాలిక సంస్కరణల్లో భాగంగా ఎల్ఐసీ లిస్టింగ్ ప్రతిపాదన వచ్చినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే కొన్ని స్టాక్ మార్కెట్లో...
* ఇప్పటికే కొన్ని ప్రైవేట్ బీమా కంపెనీలు స్టాక్ మార్కెట్లో నమోదయ్యాయి.
* వీటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్సు, ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్సు, ఎస్బీఐ ఇన్సూరెన్సు, జనరల్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ అఫ్ ఇండియా, హెచ్ డీ ఎఫ్ సి లైఫ్ ఇన్సూరెన్సు ఉన్నాయి.

ప్రీమియం వసూళ్లు
* ఈ ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఎల్ఐసి నూతన ప్రీమియం వసూళ్లు రెండింతలు పెరిగి రూ. 11,167.82 కోట్ల నుంచి రూ. 26,030.16 కోట్లకు పెరిగాయి. వ్యాపారంలో అధిక వృద్ధి ఉన్న కారణంగా ఈ సంస్థ మార్కెట్ వాటా 74 శాతానికి పెరిగింది.
* మిగతా 26 శాతం వాటా మిగతా 23 ప్రైవేట్ బీమా కంపెనీలకు ఉంది.
* జూన్ లో ఎల్ఐసి 13.32 లక్షల పాలసీలను విక్రయించింది. ఈ పాలసీల ద్వారా ఒక్క నెలలో వచ్చిన ప్రీమియం రూ. 25,000 కోట్లకు పైగా ఉంది.
* జూన్ లో ప్రైవేట్ బీమా కంపెనీల కొత్త బిజినెస్ బీమా ప్రీమియం వసూళ్లు 14.10 శాతం పెరిగి రూ. 5443.75 కోట్ల నుంచి రూ. 6,211.17 కోట్లకు పెరిగింది.

ఎల్ఐసి లిస్ట్ అయితే ఎలా ఉంటుంది..
* ఎల్ఐసి లిస్టింగ్ ద్వారా వాటా దారుల విలువ పెరగడంతో పాటు వ్యాపారం మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని, ఖాతాల్లో పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగు పడుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
* ఎల్ఐసి లో వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుతాయి.
* బీమా రంగంలోనూ అన్ని కంపెనీలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది.
* ఎల్ఐసి నిర్వహణలోని ఆస్తుల విలువ దాదాపు రూ. 31 లక్షల కోట్లుగా ఉంది.
* స్టాక్ మార్కెట్లో నమోదు అయితే మిగతా కంపెనీలకు వర్తించే నిబంధనలే ఎల్ ఐ సి కి వర్తిస్తాయి. కాబట్టి పారదర్శకత మరింతగా పెరగడమే కాకుండా పాలసీ దారులకు మరింత మెరుగైన రిటర్న్ లను అందించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications