పబ్లిక్ ఇష్యూ: మోడీ ప్రభుత్వం నిధుల వేట, స్టాక్ ఎక్స్చేంజ్‌లోకి RRB
న్యూఢిల్లీ: ఆర్థిక పరిపుష్టి కలిగిన మూడు నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB)ను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే ఈ లిస్టింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ RRBలను స్టాక్ మార్కెట్లకు పరిచయం చేసి, పబ్లిక్ ఇష్యూలకు సిద్ధం చేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీవోలకు సిద్ధంగా ఉంది. అయితే, బ్యాంకుల ఏకీకరణ పూర్తి చేసిన అనంతరం లిస్టింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది.

45 RRBలను 38కి తగ్గించాక..
ప్రస్తుతం ఉన్న 45 RRBలను 38కి తగ్గించిన అనంతరం, ఇందులోని కొన్ని బ్యాంకులను లిస్టింగ్‌కు తీసుకు రావొచ్చునని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తర్వాత మరిన్ని ఏకీకరణలు జరుగుతాయని చెబుతున్నారు. ఒక రాష్ట్రంలోని RRBలను విలీనం చేయడం ద్వారా అదనపు వ్యయాలు తగ్గించడం, టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం, మూలధన సామర్థ్యం పెంచడం, కార్యకలాపాలు పెంచడం వంటివి చేయవచ్చునని భావిస్తోంది.

పెద్ద సంస్థలు అయితే ఆర్థిక ప్రయోజనాలు
గత కొద్ది నెలల్లో పలు రాష్ట్రాల్లో 21 RRB బ్యాంకులు విలీనమయ్యాయి. దీంతో అవి ఆర్థికంగా పటిష్టమయ్యాయి. పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. మరిన్ని ఏకీకరణ చేసి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న మూడు నాలుగు బ్యాంకులను ఐపీవోకు తీసుకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. పెద్ద సంస్థలు అయితే ఆర్థిక ప్రయోజనాలు అందుకోగలవని ఈ విలీనాలకు మోడీ సర్కార్ తెరలేపింది.

RRBలలో ఎవరి వాటా ఎంతంటే?
మూడు, నాలుగు RRB బ్యాంకులు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు(IPO) రావొచ్చునని, ఈ ఏడాదే అవి రావొచ్చునని చెబుతున్నారు. RRB యాక్ట్ 1976 కింద ఈ బ్యాంకులను ఏర్పాటు చేశారు. చిన్న రైతులు, వ్యవసాయ రుణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులు రుణాలు తీసుకునేందుకు, బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఇవి పని చేస్తున్నాయి. 2015లో ఈ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్పాన్సర్ బ్యాంకుల నుంచేగాక ఇతర మార్గాల నుంచీ నిధుల సమీకరణకు వెసులుబాటు ఏర్పడింది. ప్రస్తుతం RRBలలో కేంద్ర ప్రభుత్వానికి 50%, వాటా, స్పాన్సర్ బ్యాంకులకు 35% వాటా, రాష్ట్ర ప్రభుత్వాలకు 15% వాటా ఉంది.

యాజమాన్య హక్కులు ప్రభుత్వానివే
నాలుగేళ్ల క్రితం జరిగిన సవరణ ప్రకారం కేంద్రం, స్పాన్సర్ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతానికి తగ్గకూడదు. దీంతో యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. సవరించిన చట్టం ప్రకారం స్టాక్ మార్కెట్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల వద్ద ఉన్న వాటా 51 శాతంగా ఉండి, యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. యాజమాన్య హక్కులు, నియంత్రణ మొత్తం కేంద్రం చేతుల్లో ఉంటుంది.

RRB పరిపుష్టం కోసం విలీనం
RRBలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 2005లో విలీనాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే 2006 నాటికి196 నుంచి 133కు, అనంతరం 105కు తగ్గాయి. అనంతరం 2012లో 82కు తగ్గి, కొద్దికాలానికి 56కు, క్రమంగా 45కు పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో RRB రీకాపిటలైజేషన్ కోసం రూ.235 కోట్లు కేటాయించారు. స్పాన్సర్ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీక్యాపిటలైజేషన్‌లో భాగస్వాములవుతాయి.

నిధుల వేట...
నిధుల వేటలో భాగంగా ప్రభుత్వం RRBలను పబ్లిక్ ఇష్యూలకు సమాయత్తం చేస్తోంది. ఆర్బీఐ ప్రకారం అవి రిస్క్ భరించగల ఆస్తులు 9 శాతం మేర కలిగి ఉండాలి. మూలధన పటిష్టత లక్ష్యంగా పెట్టుబడి మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2015లోనే చట్ట సవరణ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం చేతిలో యాజమాన్య హక్కులు ఉండేలా ఈ సవరణ ఉంది. అందుకే 51 శాతం కేంద్రం, PSUల వాటాలు ఉండాలి.


Click it and Unblock the Notifications