రవి జున్‌జున్‌వాలా... పెద్దగా జనాలకు తెలియని పేరు. పోనీ రాకేష్ జున్‌జున్‌వాలానా అని కన్ఫ్యూజ్ అయ్యేరు. కానేకాదు.. ఈయన పేరు రవి జున్‌జున్‌వాలానే. హెచ్ఈజీ అనే గ్రాఫైట్ సంబంధ సంస్థకు సీఈఓ. ఇది కూడా మన దేశానికి చెందిన కంపెనీయే. అయితే ఈయన ఏకంగా 2019 సీఈఓల జీతాల జాబితాలో దేశంలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచారు. గతేడాది ఆయన ఏకంగా రూ.121.27 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఏడాదికంటే ఇది 180 శాతం అధికం. సంస్థ లాభాలు పెరగడంతో ఆయన కూడా అనూహ్యంగా జీతం పెంచుకుని దేశ కార్పొరేట్ ప్రపంచం మొత్తం అవాక్కయేట్టు చేశారు.
హెచ్ఈజీ అనే సంస్థ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్‌ను తయారు చేస్తుంది. వీటిని ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల్లో ఉక్కు తయారీ కోసం వినియోగిస్తారు. ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్న రవి.. గతేడాదికి అందుకున్న రూ.122 కోట్లలో సుమారు రూ.118 కోట్లు జీతాభత్యాలతో పాటు కమిషన్లు కూడా ఉన్నాయి. వీటికి తోడు సంస్థ సంపాదించిన నికర లాభాల్లో 2.5 శాతం వాటాను ఆయన కూడా తీసుకున్నారు. దేశ కంపెనీల చట్టం 2013లో సెక్షన్ 198 ప్రకారం ప్రమోటర్లకు ఆ వెసులుబాటు ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం కంపెనీలో సిబ్బంది జీతమంతా కలిపి రూ.198 కోట్లుగా తేలింది. గతేడాది ఆయన రూ.43 కోట్లు, అంతకుముందు ఏడాది కేవలం రూ.2.34 కోట్ల జీతాన్ని మాత్రమే అందుకున్నారు. అయితే ఈ సారి మాత్రం అందరూ అవాక్కయ్యేలాంటి జీతాన్ని తీసుకున్నారు.

లాభాలే.. లాభాలు
ఈ హెచ్ఈజీ సంస్థ గతేడాది అత్యద్భుతమైన లాభాలను ప్రకటించింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గ్రాఫైట్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఈ సంస్థ లాభాలు, ఆదాయం, స్టాక్ ప్రైస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మార్చికి సంస్థ అమ్మకాల్లో 140 శాతం పెరిగి రూ.6593 కోట్లకు చేరాయి. సంస్థ నికరలాభం రూ.1099 కోట్ల నుంచి రూ.3026 కోట్లకు ఎగబాకింది. అయితే మార్కెట్ వేల్యూ మాత్రం ఏకంగా 81 శాతం పతనమైంది. రూ.4950 వరకూ స్టాక్ ధర ఇప్పుడు రూ.1050కి పడిపోయింది.

లిస్టెట్ కంపెనీ అలా పెంచుకోవచ్చా
ప్రైవేట్ సంస్థల్లోని యాజమాన్యాలు వాళ్ల ఇష్టానుసారం తీసుకోవచ్చు. అయితే ఇది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాబట్టి పక్కాగా అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక మేనేజీరియల్ స్థాయి వ్యక్తి సంస్థ నికర లాభంలో 5 శాతం మాత్రమే తీసుకోవచ్చు. అదే ఎక్కువ మంది ఇదే స్థాయి సిబ్బంది ఉంటే వాళ్లందరి జీతం నికర లాభంలో 10 శాతానికి మించి ఉండకూడదు.

లిస్ట్‌లో గల్లా జయదేవ్
2019లో ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం హీరో మోటోకార్ప్ ఎండి పవన్ ముంజాల్ రూ.80.41 కోట్లు, ఎల్ అండ్ టి సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణియన్ రూ.48.45 కోట్ల జీతాన్ని అందుకున్నారు. తెలుగు కంపెనీ అయిన అమరరాజాకు వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న గల్లా జయదేవ్ రూ.39.69 కోట్ల జీతాన్ని అందుకున్నారు. మొన్నటికి మొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ కూడా తన రూ.15 కోట్ల పాత జీతాన్నే కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన పదకొండేళ్లుగా అదే జీతాన్ని తీసుకుంటూ ఉండడం ప్రధానంగా గమనించాల్సిన మరో అంశం.


Click it and Unblock the Notifications