జగన్‌కు 'రూ.10 కోట్ల' ఊరట: 'జగతి ఆస్తుల్ని, డిపాజిట్స్ విడుదల చేయండి'
న్యూఢిల్లీ: వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రాంకీ, జగతి పబ్లికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. ఈ కంపెనీల డిపాజిట్స్ విడుదల చేయాలని ఈడీకి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఢిల్లీ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రాంకీకి షరతులు విధించింది. ఆస్తుల్లో నిర్మాణాలు చేపట్టడం గానీ, ఇతరులకు విక్రయించడం గానీ చేయరాదని ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను జఫ్తు నుంచి విడుదల చేయాలని చెబుతూ, జగతి కూడా రూ.10 కోట్ల మొత్తానికి సమానమైన ఇండెమ్నిటీ బాండును హామీగా ఈడీకి సమర్పించాలని స్పష్టం చేసింది.

రాంకీ, జగతి డిపాజిట్స్ జఫ్తు
హైకోర్టు ఆదేశాల మేరకు CBI నమోదు చేసిన కేసు ఆధారంగా ED కేసు నమోదు చేసి, ఆస్తుల్ని జప్తు చేసింది. రాంకీ ఫార్మాకు కేసులో రెండు విడతలుగా ఈ గ్రూప్‌కు చెందిన రూ.101.35 కోట్లు, రూ.212.85 కోట్లు విలువైన ఆస్తుల్ని, జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీకి చెందిన 32.39 కోట్ల చరాస్తుల్ని, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను జప్తు చేసింది. వీటిని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ సమర్థిస్తూ 2013లో ఆర్డర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జగతి, రాంకీ అప్పిలేట్ అథారిటీకి వెళ్లింది.

రాంకీకి ఉరట
దీనిపై విచారణ జరిపిన అప్పిలేట్ అథారిటీ శుక్రవారం తీర్పు చెప్పింది. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ తీర్పును సవరిస్తూ, ఆస్తులను విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది. ఫార్మా సిటీలో 50 మీటర్ల మేర బఫర్ జోన్‌ను వదిలి పెట్టాలని రాంకీని ఆదేశించింది. తీర్పు వచ్చే వరకు ఇతరులకు విక్రయించరాదని, నిర్మాణాలు చేపట్టరాదని రాంకీని ఆదేశించింది. 500 మీ. లోపల ఉన్న జప్తు సీబీఐ ప్రత్యేక కోర్టులో తీర్పు వెలువడేదాకా కొనసాగుతుందని తెలిపింది. జప్తు చేసిన మిగిలిన ఆస్తుల్ని కూడా విడుదల చేయాలని ఆదేశించింది.

జగతికి ఊరట
ఇక, జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్లను బాండ్స్ రూపంలో పూచీకత్తు తీసుకుని విడుదల చేయాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే, వెంటనే డిపాజిట్ చేయాలని పేర్కొంది. ఈ మొత్తం కేసులో ప్రత్యేక కోర్టు ఇంకా అభియోగాలు నమోదు చేయలేదని చెప్పారు. అభియోగాలు నమోదు చేయనంత వరకు వ్యక్తులపై, సంస్థలపై మనీ లాండరింగ్ ఆరోపణలు చేస్తే, వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఈడీదేనని స్పష్టం చేశారు.

రూ.10 కోట్ల లంచం నిరూపించలేదు..
ఫార్మా ఇండస్ట్రియల్ పార్క్ గ్రీన్ బెల్ట్ ఏరియాను 50 మీటర్లకు తగ్గించినందుకు రాంకీ గ్రూప్... జగతిలో రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టిందనేది సీబీఐ ఆరోపణ. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. రాంకీ, జగతి ఆస్తులను ఈడీ జఫ్తు చేసింది. రూ.10 కోట్లు.. లంచం అని ఈడీ నిరూపించలేకపోయిందనేది వీరి వాదన. అనుమానాలు, ఊహాగానాల ఆధారంగా జగతి, రాంకీ ఆస్తులను ఈడీ జఫ్తు చేసిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications