ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఈ ధరలు భారీగా తగ్గింపు, రూ.1.50 లక్ష వరకు బెనిఫిట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను అందించింది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు విద్యుత్ ఛార్జర్లు, ఛార్జింగ్ కేంద్రాలపై కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సెల్ శనివారం నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఈ పన్నులు ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులను తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం విద్యుత్ ఆధారిత వాహనాల్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీఎస్టీ భారాన్ని తగ్గించింది.

జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు
ఈవీ వాహనాలపై 12 శాతం నుంచి 5 శాతం, విద్యుత్ ఛార్జర్లు, ఛార్జింగ్ కేంద్రాలపై 18 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించడంతో పాటు జీఎస్టీ మండలి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థలు 12 మందికి మించి ప్రయాణీకులను తీసుకు వెళ్లగలిగే విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకుంటే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్టీ సీఎంపీ 02 ఫారాలను దాఖలు చేసే గడువు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణకు దోహదం
జీఎస్టీ మండలి తాజా నిర్ణయం పర్యావరణకు పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ నిర్ణయంతో ముడిచమురు దిగుమతులు తగ్గడమేగాక సౌర విద్యుదుత్పత్తి రంగానికి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్ ఖర్చులో దాదాపు 40 శాతం బ్యాటరీలకే పెట్టవలసి వస్తుందని, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు దేశీయ బ్యాటరీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. లిథియం - ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తి ప్లాంట్ కోసం టాటా కెమికల్స్‌తో చర్చిస్తున్నామన్నారు.

రూ.1.50 లక్షల వరకు ఆదా
జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి. మోడల్‌ను బట్టి రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైఎండ్ ఎలక్ట్రిక్ కార్ల కాస్ట్ రూ.25 లక్షల వరకు ఉంది. అలాగే లో ఎండ్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉన్నాయి. లోఎండ్ కార్లకు రూ.50వేల నుంచి హైఎండ్ కార్లకు రూ.1.5 లక్షల వరకు ఆదా కానుంది.

ఈవీల ప్రోత్సాహం కోసం కేంద్రం చేపట్టిన చర్యలు
ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుగోలు కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ రూ.1.5 లక్షల మొత్తం వరకు ఆదాయపు పన్ను నుంచి అదనంగా మినహాయింపు ఇస్తూ 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రకటించింది. దిగుమతి సుంకాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలకు మినహాయింపు ఇచ్చింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మౌలికవసతుల కల్పన, EVల తయారీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు ఫేమ్ 2 స్కీం కింద రూ.10వేల కోట్ల కేటాయించేందుకు అనుమతి.


Click it and Unblock the Notifications