దేశంలోని వివిధ నగరాల్లో జీవిత బీమా కు సంబంధించి మాక్స్ లైఫ్ వెలువరించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించిన అంశాలు బీమాపై ఇక్కడి ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉన్నది, వారు తమ రక్షణకు ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తున్నారో ఈ సర్వే తెలియజేసింది. రాబోయే కాలంలో ఊహించని విధంగా ఏర్పడే ఆనిచ్చితుల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ఆర్థికంగా ఎంతవరకు సమాయత్తంగా ఉన్నారు, వారిలో జీవిత బీమా, టర్మ్ ఇన్సూరెన్సు లపై చైతన్యం ఎలా ఉంది, బీమా పాలసీల కొనుగోలు విషయంలో ప్రాథమికంగా ఎలాంటి భయాలు ఉన్నాయి, ప్రాధాన్యాలు ఎలా ఉన్నాయన్న పలు అంశాల ఆధారంగా ఈ సర్వేను చేపట్టారు. ఆ వివరాలు...

జీవిత బీమా...
* దేశంలో బీమా అవగాహన విషయానికి వస్తే హైదరాబాద్ అగ్ర స్థానంలో ఉంది. నగరంలో 83 శాతం మంది జీవిత బీమా రక్షణ కలిగి ఉన్నారు.
* బీమా చైతన్యం విషయంలో 100 పాయింట్ల స్కేల్ పై 44 పాయింట్లతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. దేశ సగటు మాత్రం 35 శాతమే ఉంది.
* టర్మ్ ప్లాన్, మార్కెట్ లింక్డ్ ప్లాన్లు, సేవింగ్స్ ప్లాన్ల పై అవగాహన విషయంలో బెంగళూరు తో పోల్చితే హైదరాబాద్ రెట్టింపు అధిక స్థాయిలో ఉంది. ఈ విభాగాల్లో బెంగళూరు స్కోర్ 25 ఉండగా.. హైదరాబాద్ స్కోర్ 50 ఉండటం విశేషం.

టర్మ్ ఇన్సూరెన్సు ప్రయోజనాలపై అవగాహన తక్కువ
* దేశంలోని వివిధ ప్రాంతాలకన్నా ఎక్కువగా దక్షిణాదిలోనే జీవిత, టర్మ్ ఇన్సూరెన్సు కు ఆదరణ లభిస్తోంది. శాతం పరంగా చూస్తే దక్షిణాదిలో జీవిత బీమా 74 శాతం, టర్మ్ ఇన్సూరెన్సు 24 శాతంగా ఉంది. ఇది తూర్పు రాష్ట్రాల్లో వరుసగా 72 శాతం, 24 శాతం, పశ్చిమాదిలో 57 శాతం, 16 శాతం, ఉత్తరాదిలో వరుసగా 59 శాతం, 22 శాతం ఉండగా. జాతీయ స్థాయిలో వరుసగా 65 శాతం, 21 శాతంగా ఉంది.
* హైదరాబాద్ లో 83 శాతం మంది జీవిత బీమాను కలిగి ఉండగా.. టర్మ్ ఇన్సూరెన్సు మాత్రం కేవలం 23 శాతంగా మాత్రమే ఉంది. టర్మ్ ఇన్సూరెన్సు అవగాహన విషయంలో దేశ పట్టాన ప్రాంతాల సగటు 47 శాతం ఉండగా .. హైదరాబాద్ లో 44 ఉంది. నలుగురిలో ఒక్కరికే టర్మ్ ఇన్సూరెన్సు ఉందన్న మాట. ఇది కొంత ఆందోళన కరమైనదే.

తీవ్ర అనారోగ్యాల కవరేజీ విషయంలో...
* తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ అందించే క్రిటికల్ ఇల్ నెస్ పాలసీలకు హైదరాబాద్ ప్రజలు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
* తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో తమను ఎవరు ఆదుకోరని ఏడూ శాతం మంది విశ్వసిస్తున్నారు.
* 68 శాతం మందికి తీవ్ర వ్యాధుల చికిత్సకు ఎంత వరకు ఖర్చు అవుతుందో తెలియదట.
* క్రిటికల్ ఇల్ నెస్ తమ కుటుంబాన్ని కుదిపేస్తుందని కేవలం 15 శాతం మందికి మాత్రమే తెలుసు. 48 శాతం మంది దీని గురించి ఆలోచించడం లేదట.
* తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భంలో తమ పొదుపు మొత్తాలు ఏడాదికి కూడా సరిపోవని 24 శాతం మంది భావిస్తున్నారు.

యువతరం పరిస్థితి అంతే...
* 25 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్న వారిలో దాదాపు 43 శాతం మంది తమ కుటుంబాల రక్షణ గురించి ఆలోచించడం లేదని సర్వేలో వెల్లడైంది.
* 44 శాతం మంది యువతకు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్సు గురించి తెలుసట. కేవలం 17 శాతం మంది మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉన్నారట.
* యువతలో ఎక్కువ శాతం మంది ప్రయాణాలు, విలాసాలు, ఇతర ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
* టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. బీమా రక్షణ ఎక్కువ లభిస్తుంది. అయితే పాలసీ తీసుకున్న వారు మరణించిన సందర్భంలోనే బీమా మొత్తం కుటుంబ సభ్యులకు అందుతుంది.


Click it and Unblock the Notifications