ఎయిర్‌టెల్‌ను దాటేసి, రెండో స్థానంలోకి రిలయన్స్ జియో: నికర లాభం రూ.891 కోట్లు
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌కు షాక్ తగిలింది. మూడేళ్లలోనే రిలయన్స్ జియో అనూహ్యంగా రెండో స్థానంలోకి దూసుకువచ్చి, భారతీ ఎయిర్‌టెల్‌ను దాటేసింది. జియో వచ్చినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. డేటా ప్యాకేజీ, కాల్స్ పరంగా పోటీ టెలికం సంస్థలు ఛార్జీలు తగ్గించే పరిస్థితులు వచ్చాయి. జియో కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలో 30 కోట్ల కస్టమర్లకు రీచ్ అయిన టెలికం సంస్థగా ఇటీవలే రికార్డ్ సృష్టించింది. తాజాగా, ఎయిర్‌టెల్‌ను దాటి రెండో స్థానంలో నిలిచింది జియో.

ఎయిర్‌టెల్‌ను దాటేసిన జియో
తాజాగా కస్టమర్ల సంఖ్యాపరంగా జియో... ఎయిర్‌టెల్‌ని దాటేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ట్రాయ్ విడుదల చేసిన మే నెల నివేదికలో తేలింది. ట్రాయ్ నివేదిక ప్రకారం 387.6 మిలియన్ల వినియోగదారులతో వొడాఫోన్-ఐడియా తొలి స్థానంలో ఉంది. జియో 323 మిలియన్స్, ఎయిర్‌టెల్ 320.38 మిలియన్స్ కస్టమర్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏప్రిల్ - మే క్వార్టర్‌లో జియో కొత్తగా 8.2 మిలియన్ల కస్టమర్లను యాడ్ చేసుకుంది. దీంతో 323 మిలియన్లకు చేరుకుంది.

మినిమం రీచార్జ్ ప్లాన్ వల్ల తగ్గిన కస్టమర్లు
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల మినిమమ్ రీచార్జ్ ప్లాన్‌ను తీసుకు వచ్చాయి. అప్పటి నుంచి నెట్ వర్క్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పడిపోతున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ ఏడాది మే నెలలో ఎయిర్‌టెల్ 15.1 లక్షలు, వొడాఫోన్ ఐడియా 57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయిందని ట్రాయ్ నివేదిక తెలిపింది. రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన 4జీ ఫీచర్ ఫోన్, జియో ఫోన్ లాంటివి కూడా కస్టమర్లను ఆకట్టుకున్నాయని ట్రాయ్ నివేదిక వెల్లడించింది.

జియో నికర లాభం రూ.891 కోట్లు
కాగా, రిలయన్స్‌కు చెందిన టెలికాం విభాగం జియో నికర లాభం 45.60 శాతం వృద్ధి చెంది రూ.891 కోట్లకు చేరింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే జియో గిగా ఫైబర్ సేవల బీటా పరీక్షలు విజయవంతమయ్యాయని, త్వరలోనే పూర్తి స్థాయి సేవలను ప్రారంభిస్తామని ముకేష్ అంబానీ తెలిపారు. 5 కోట్లకు పైగా గృహాలను లక్ష్యంగా చేసుకుని వాటిని తీసుకువస్తామన్నారు.

నిర్వహణ ఆదాయం భారీగా పెరిగింది
జియో నిర్వహణ ఆదాయాలు 44 శాతం పెరిగి రూ.11,679 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే 5.2% పెరిగింది. ఎబిటా మార్జిన్ 130 బేసిస్ పాయింట్లు పెరిగి 40.10 శాతానికి చేరింది. ఆదాయాలు 54.5% పెరిగి రూ.14,910 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం వినియోగదారులు 2.46 కోట్లు పెరిగి 33.13 కోట్లకు పెరిగారు. సగటు వినియోగదారు ఆదాయం అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే రూ.126.2 నుంచి రూ.122 కు తగ్గింది.


Click it and Unblock the Notifications