భూషణ్ స్టీల్స్ మరో ఫ్రాడ్, పంజాబ్&సింద్ బ్యాంక్‌కు రూ.238 కోట్ల మోసం
భూషణ్ పవర్ అండ్ స్టీల్ కోట్లాది రూపాయలు చీట్ చేశాయని అలహాబాద్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇప్పుడు మరో బ్యాంకు కూడా తమను భూషణ్ స్టీల్స్ మోసం చేసిందని బుధవారం నాడు వెల్లడించింది. రూ.238 కోట్ల మేర ఫ్రాడ్ చేసిందని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వెల్లడించింది.
ఫోరెన్సిక్ ఆడిట్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రూ.238.30 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు, కంపెనీ, దాని డైరెక్టర్లు ఈ మేర ఫండ్స్ మళ్లించినట్లు గుర్తించారు. ఈ మేరకు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించింది.
రుణదాతల బ్యాంకుల కన్సార్టియం నుంచి నిధులను సేకరించేందుకు భూషణ్ పవర్ అండ్ స్టీల్స్ లిమిటెడ్ (BPSL) బ్యాంకు నిధులను దుర్వనియోగం చేసిందని, అకౌంట్ బుక్స్‌ను తారుమారు చేసిందని పంజాబ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుతం దీని కేసు NCLTలో ఉందని, తాము మంచి రికవరీని ఆశిస్తున్నామని పేర్కొంది. రుణాల్లో ఇప్పటికే రూ.189.35 కోట్ల కేటాయింపులు జరిపినట్లు తెలిపింది.

కాగా, అంతకుముందు అలహాబాద్ బ్యాంకు కూడా రూ.1,774.82 కోట్ల మేర BPSL చీట్ చేసినట్లుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపింది.
NPA కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఆడిటింగ్ ఆధారంగా మోసం వెలుగుచూసిందని బ్యాంక్ తెలిపింది. బ్యాంకు నిధుల్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని, బ్యాంక్స్ కన్సార్షియం నుంచి నిధులు సమీకరించేందుకు ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు తెలిపింది. భూషణ్ స్టీల్స్‌కు ఇచ్చిన రుణాల్లో రూ.900 కోట్లకు ఇప్పటికే కేటాయింపులు జరిపినట్టు బ్యాంక్ పేర్కొంది.
ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) పరిధిలో ఉంది. అయితే బ్యాంకు తాను ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకునే అవకాశముందన్న విశ్వాసాన్ని అలహాబాద్ బ్యాంక్ వ్యక్తం చేస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం రూ.3,800 కోట్లకు పైగా మోసాన్ని గుర్తించింది. బ్యాంకుకు రూ.3,805 కోట్లు బకాయిపడ్డ భూషణ్ స్టీల్ లిమిటెడ్ ఈ రుణాలను మోసపూరితంగా పొందినట్లు గుర్తించామని అంతకుముందు ఆర్బీఐకి తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ తర్వాత ఇప్పుడు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.. భూషణ్ స్టీల్స్ మోసంపై బయటకు రావడం గమనార్హం.


Click it and Unblock the Notifications