న్యూఢిల్లీ: ఎల్ఐసీ (లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్) మోసం చేసిందంటూ దాఖలైన పిల్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. ఈ పిల్‌పై విచారణ జరిపేందుకు నో చెప్పింది. LIC జీవన్ సరళ్ పాలసీ పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మనీలైఫ్ ఫౌండేషన్ పిల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా బెంచ్ విచారించింది.

జీవన్ సరళ్ పాలసీ నష్టం చేస్తోందంటూ...
జీవన్ సరళ్ పాలసీలో పదేళ్లు అంతకంటే ఎక్కువ మదుపు చేస్తే చెల్లించిన ప్రీమియంలో సగం వాపస్ వస్తుందని, ఇది సీనియర్ సిటిజన్లకు నష్టం కలిగిస్తుందని పిటిషన్ తరఫు లాయర్లు పేర్కొన్నారు. ఇందులోని అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు ఎల్ఐసీ జోనల్ కార్యాలయాలకు లేఖలు రాసిందన్నారు. ఈ పాలసీని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎల్ఐసీ, ఐఆర్డీఏలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

కన్స్యూమర్ కోర్టుకు వెళ్లవచ్చు
అయితే ఈ పిల్ పైన విచారణ జరిపిన సుప్రీం కోర్టు... చట్ట ప్రకారం దీనిని విచారించలేమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం వినియోగదారుల కోర్టు (కన్స్యూమర్ కోర్టు)ను ఆశ్రయించవచ్చు. 'మేము ఈ ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించలేము' అని బెంచ్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వోకేట్ అర్వింద్ దరార్ వాదనలు వినిపించారు.

పెద్ద స్కాం అంటూ ఆరోపణలు
ఎల్ఐసీ జీవన్ సరళ్ పాలసీ కారణంగా దాదాపు 5 కోట్ల మంది పాలసీ హోల్డర్లు తమ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై పెద్ద మొత్తంలో కోల్పోయారని ఈ సంస్థ తమ పిల్‌లో ఆరోపించింది. పాలసీ హోల్డర్లు.. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ నుంచి ఈ పాలసీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ఇది రూ.1 లక్ష కోట్ల స్కాం అని, ఈ పాలసీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో తాము పిల్ దాఖలు చేశామని, ఎల్ఐసీ చీట్ చేస్తోందని ఆరోపించారు. అయితే ఈ పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.


Click it and Unblock the Notifications