ఇన్ఫోసిస్ క్యూ1 నికర లాభం రూ 3,802 కోట్లు
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ... అంచనాలకు అనుగుణంగా మెరుగైన ఫలితాలను వెల్లడించింది. జూన్ తో ముగిసిన తోలి త్రైమాసికంలో (క్యూ1) బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్... నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5% పెరిగి రూ 3,802 కోట్లకు చేరింది. అయితే, సీక్వెన్షియల్ పధ్ధతి లో చూస్తే మాత్రం కంపెనీ లాభం 6.8% తగ్గడం గమనార్హం. మార్కెట్ అనలిస్టులు ఇన్ఫోసిస్ నికర లాభం సుమారు రూ 3,700 కోట్ల నుంచి రూ 3,800 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అందుకు తగ్గట్లే ఇన్ఫోసిస్ క్యూ1లో మెరుగైన పనితీరును కనబరిచింది. కాగా, ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ 21,803 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే త్రైమాసిక ఆదాయం రూ 19,128 కోట్లతో పోల్చితే ఇది ఏకంగా 14% అధిక కావడం విశేషం. సీక్వెన్షియల్ పద్ధతిలోనూ అమ్మకాలు 1.2% పెరిగాయి.
గైడెన్స్ పెంపు...
మార్కెట్ గమనాన్ని బట్టి, క్లయినట్లు ఇచ్చే ఆర్డర్స్ ను బట్టి భవిష్యత్ అంచనాలను వెల్లడించటం ఇన్ఫోసిస్ ఆనవాయితీ. దీనిని గతంలో కంటే సవరించి మరింత ఎక్కువ స్థాయి వృద్ధిని అంచనా వేసింది. దీనినే గైడెన్స్ గా పేర్కొంటారు. ఈ గైడెన్స్ ను ఇన్ఫోసిస్ తాజాగా 8.5% నుంచి 10% నికి పెంచింది. అంటే, కంపెనీ వ్యాపారం వచ్చే త్రైమాసికాల్లో, అలాగే వచ్చే ఏడాదికి బెటర్ గా ఉండబోతోందని అర్థం. అయితే నిర్వహణ మార్జిన్లను 21-23 % గానే కొనసాగించింది.

$2.7 డాలర్ల డీల్...
కొత్త ఏడాదికి పటిష్టమైన ప్రారంభం లభించింది. కాన్స్టాంట్ కరెన్సీ ప్రాతిపదికగా 12.4% వార్షిక వృద్ధిని సాధించాం. డిజిటల్ రెవిన్యూ వృద్ధి 41.9% గా ఉంది. కస్టమర్ల తో సత్సంబంధాలను నెలకొల్పుకోవడం కోసం మెం పెట్టిన పెట్టుబడులు, చూపిన శ్రద్ధ వల్లే ఇది సాధ్యమైంది. అందుకే గైడెన్స్ ను 7. 5% -9% నుంచి 8.5% -10% నికి పెంచుతున్నాం అని ఇన్ఫోసిస్ సీఈఓ & ఎండీ సలీల్ పరేఖ్ వెల్లడించారు. తోలి త్రైమాసికంలో కంపెనీ ఏకంగా $2.7 డాలర్ల విలువైన కొత్త డీల్స్ లభించినట్లు కంపెనీ తెలిపింది.
బై బ్యాక్ కొనసాగింపు...
ఇన్ఫోసిస్ గతంలో ప్రకటించిన షేర్ ల బై బ్యాక్ ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా రూ 8,260 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు కంపెనీ రూ 5,934 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. ఇన్ఫోసిస్ కాష్ ఫ్లోస్ కూడా ప్రస్తుతమున్న 70% నుంచి 85% పెరిగే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications