న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 2019-20 ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) మంచి బోణీ కొట్టింది. క్వార్టర్ వన్ లాభం వార్షిక ప్రాతిపదికన 10.8 శాతం పెరిగి రూ.8,131 కోట్లకు చేరుకుంది. 2018-19లో ఇదే త్రైమాసికానికి గాను కంపెనీ లాభం రూ.7,340 కోట్లుగా ఉంది. జనవరి-మార్చి కాలంలోని రూ.8,126 కోట్ల లాభంతో పోలిస్తే అతి స్వల్పంగా పెరిగింది.

గత ఏడాదితో పోలిస్తే లాభాలు ఇలా...
ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను టీసీఎస్ ఆదాయం 11.4 శాతం వృద్ధితో రూ.38,172 కోట్లకు చేరుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్లో కంపెనీ ఆదాయం రూ.34,261 కోట్లు. జనవరి-మార్చి త్రైమాసికం రూ.38,010తో పోలిస్తే మాత్రం స్వల్పంగా (0.42 శాతం) పెరిగింది. ఈ ఏడాది కంపెనీ వాటాదారులకు రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు TCS బోర్డు ఓకే చెప్పింది.

వరుసగా నాలుగోసారి డబుల్ డిజిట్ గ్రోత్
డాలర్ల రూపంలో ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 1.6% పెరిగి 5,485 మిలియన్ డాలర్లకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 8.6 శాతం వృద్ధి నమోదయింది. సమీక్ష కాలానికి స్థిర కరెన్సీ ప్రకారం కూడా ఆదాయంలో 10.6% వృద్ధి నమోదు చేసింది. TCS వరుసగా నాలుగో త్రైమాసికంలో కూడా డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేసింది. జనవరి-మార్చి కాలానికి వృద్ధిరేటు 12.7 శాతంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 9.3 శాతంగా నమోదయింది. జూన్ త్రైమాసికంలో TCS నిర్వహణ మార్జిన్ 24.2 శాతానికి పరిమితమైంది. మార్చి త్రైమాసికంలో నమోదైన 25.1 శాతంతో పోలిస్తే దాదాపు ఒక శాతం తగ్గింది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లోనూ మార్జిన్ ఎక్కువే ఉంది.

ఏ విభాగంలో ఎంత ఆదాయమంటే?
లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్‌కేర్ విభాగం ఆదాయం 18.1 శాతం, BFSI 9.2 శాతం, రిటైల్ అండ్ సీపీజీలో 7.9 శాతం, కమ్యూనికేషన్స్ అండ్ మీడియాలో 8.4 సాతం, టెక్నాలజీ సర్వీసెస్‌లో 7.8 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్‌లో 5.5 శాతం చొప్పున వృద్ధి నమోదయింది. యూకే, యూరోప్, ఇండియాలో టీసీఎస్ గ్రోత్ వరుసగా ఇయర్ టు ఇయర్... 16 శాతం, 15 శాతం, 15.9 శాతం ఉంది. ఉత్తర అమెరికాలో 7.7 శాతం, ఆసియా పసిఫిక్‌లో 9.5 శాతం, లాటిన్ అమెరికాలో 6.4 శాతం వృద్ధి నమోదయింది. షేర్ పైన టీసీఎస్ గ్రోత్ ఇయర్ టు ఇయర్ 13 శాతం పెరిగి, రూ.21.67కు పెరిగింది. వలసల రేటు 11.3 శాతంగా ఉంది.

వేలాదిమందికి క్వార్టర్ 4లో ఉద్యోగాలు
ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో TCS 12,356 మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. గత అయిదేళ్లలో ఈ కంపెనీ నియామకాల్లో ఇది అత్యధికం. 30,000 మందికి పైగా ఫ్రెషర్లకు అవకాశం కల్పించింది. అందులో 40 శాతం మంది క్యూ1లో కంపెనీలోకి చేరారు. మిగతా వారు రెండో త్రైమాసికం (క్యూ2)లో చేరనున్నారు. జూన్ 30 నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 4,36,641గా ఉంది. ఉద్యోగుల్లో మహిళల శాతం 36.1 శాతంగా ఉంది. కంపెనీలోని ఉద్యోగులు 149 దేశాలకు పెరిగింది. క్వార్టర్ 1లో 3,15,000 మంది ఉద్యోగులకు కొత్త కొత్త టెక్నాలజీపై ట్రెయినింగ్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 30 వరకు కంపెనీ 4,682 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది.


Click it and Unblock the Notifications