రూ.2,000, రూ.500, రూ.200 నోట్ల ప్రింటింగ్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
న్యూఢిల్లీ: రూ.2,000 నోటు ముద్రణకు అంతకుముందు ఏడాది కంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 65 పైసలు లేదా 18.4 శాతం ఖర్చు తగ్గింది. నవంబర్ 2016 నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2,000, రూ.500, రూ.200 నోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్బీఐకి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్ (BRBNMPL) మాత్రమే దీనిని ముద్రిస్తోంది.

రూ.2.000 నోటుకు తగ్గిన ఖర్చు
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 నోటు ముద్రణకు రూ.4.18 పైసలు ఖర్చు అయింది. గత ఏడాది నోటు ముద్రణ ఖర్చు తగ్గి, రూ.3.53గా ఉంది. ఈ మేరకు రాజ్యసభకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఈ సమాచారం మేరకు... 2017-18లో రూ.500 నోటు ముద్రణకు రూ.2.39 పైసలు వ్యయం కాగా, 2018-19లో రూ.2.13 పైసలుగా ఉంది. రూ.200 నోటు ముద్రణ ఖరీదు 2017-18లో రూ.2.24 ఉండగా, 2018-19లో రూ.2.15కు తగ్గింది.

ఈ ఖర్చు యథాతథం
ఈ గణాంకాలు BRBNMPL ముద్రించిన నోట్లకు సంబంధించినవి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) కూడా కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తుంది. ఇది రూ.500, రూ.200 నోట్లను ప్రింట్ చేస్తుంది. ఇక్కడ రూ.500 నోట్ల ముద్రణకు రూ.3.375 వ్యయం అవుతోంది. గత ఏడాది కూడా ఇదే ఖర్చు అయింది. ఎలాంటి తేడా లేదు. రూ.200 నోటు ముద్రణకు 2018-19లో రూ.3.12గా ఉంది. 2017-18లోను ఇదే వ్యయం అయింది.

2016 కంటే 2017లో పెరిగిన ప్రింటింగ్ ఖర్చు
2017-18 (జూలై నుంచి జూన్)లో కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు రూ.7,965 కోట్లు ఖర్చయింది. అంతకుముందు ఏడాది అంటే 2016-17లో ఈ కరెన్సీ నోట్లకు అయిన ఖర్చు రూ.4,912. కాగా, నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications