చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుడి నుంచి ధనికుడి వరకు, డబ్బా దుకాణం నుంచి ఐటీ కంపెనీ వరకు వాటర్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి. పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కొన్ని పరిశ్రమలు ఉద్యోగులను.. ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకోవాలని సూచించాయి. ఇవే చెన్నై నీటి కష్టాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంటే, మరో షాకింగ్ అంశం కూడా ఉంది.

డాక్టర్లు కూడా నీటిని కొనుగోలు చేస్తున్నారు
వర్షాలు కురవాలని దేశమంతా కోరుకుంటోంది. ముఖ్యంగా తమిళనాడు, చెన్నై ప్రజలు భారీ వర్షాలు కురవాలని పూజలు చేస్తున్నారు. డాక్టర్లు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి చికిత్స చేయడం దేవుడి మీద ఆధారపడి ఉందని వాపోతున్నారట డాక్టర్లు. వర్షం కారణంగా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు డాక్టర్లు కూడా వైద్యం చేయడానికి నీటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయట.

ఆసుపత్రి నీటి కొనుగోలు భారం రోగుల ఖాతాల్లోకి..
భారతదేశంలోని నాలుగో అతిపెద్ద నగరమైన ఈ చెన్నైలో నీటి సరఫరా కష్టాలు తీరకుంటే రోగులకు చికిత్స చేయడం ఇక దేవుడు చూపే దయపై ఆధారపడి ఉందని సుదార్ హాస్పిటల్స్ చైర్మన్ రవిశంకర్ అన్నారు. ఆయనకు 150 బెడ్స్‌తో నాలుగు ఆసుపత్రులు ఉన్నాయి. ఇప్పటికే పైప్ వాటర్ మొత్తం అడుగంటాయి. ప్రస్తుతం ట్రక్కుల ద్వారా ఎక్కువ డబ్బు చెల్లించి నీళ్లు తెప్పించుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు ఈ నీరు కూడా కష్టం కావొచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ (ఆపరేషన్) వంటి వాటికి నీరు అవసరమైతే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నీటి కటకట ఎలా ఉందో అర్థమవుతోంది.

రోగులకు చికిత్స కూడా చేయలేని పరిస్థితి వస్తుంది...
సర్జరీ సహా అన్నింటికి నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఎదురవడంతో ఈ ఖర్చు భారం పేషెంట్లపై వేయాల్సి వస్తుందని రవిశంకర్ చెబుతున్నారు. ఇలాగే ఉంటే నెల రోజుల తర్వాత వచ్చిన రోగులకు చికిత్స చేసే పరిస్థితులు కూడా ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో వాటర్ క్రైసిస్ నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications