100 మార్కులు, 5 విభాగాలు: ఏపీలో వాలంటీర్ల సెలక్షన్ ప్రాసెస్ ఇదీ! సిఫార్స్ ఆందోళన
అమరావతి: జూలై 11వ తేదీ నుంచి వాలంటీర్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే పట్టణ వాలంటీర్ అభ్యర్థులకు అయిదు విభాగాల్లో వంద మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలకు అభ్యర్థులు ఇచ్చే సమాధానాలపై ఒక్కో కేటగిరీలో 20 మార్కులు కేటాయిస్తారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ... నగరపాలక సంస్థల కమిషనర్లకు సూచనలు చేసింది. మున్సిపల్ శాఖ మంగళవారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది.

ఎవరికెన్ని మార్కులు రావాలి... ఎలా వేస్తారు
వార్డు వాలంటీర్ల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 మార్కులు, బీసీ, ఓసీ అభ్యర్థులకు 40 మార్కుల చొప్పున వస్తే వారిని అర్హులుగా ప్రకటిస్తారు. 100 మార్కులకు నిర్వహించే ఈ ఇంటర్వ్యూలో విభాగానికి 20 మార్కులు, ఐదు విభాగాల్లో ప్రశ్నలు ఉన్నాయి. చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వేర్వేరుగా మార్కులు ఇస్తారు. అనంతరం అన్నింటిని పరిగణలోకి తీసుకొని అర్హులను ప్రకటిస్తారు.

మార్కుల విభాగాలు ఇవే....
అభ్యర్థి నిర్దేశిత వార్డు, గ్రామానికి సంబంధించి 20 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనపై 20 మార్కులు, ఇప్పటికే స్వచ్చంధ సేవకుడిగా, సమాఖ్య ప్రతినిధిగా, సామాజిక సేవకుడిగా పని చేసి ఉంటే 20 మార్కులు, నాయకత్వ లక్షణాలు, చక్కటి భావవ్యక్తీకరణ, సాధారణ అంశాలపై అవగాహనకు 20 మార్కులు, వివిధ పరీక్షల్లో సాధించిన మార్కులపై 20 మార్కులు ఇస్తారు.

అభ్యర్థి అర్హతలు
అభ్యర్థి ప్రధానంగా అదే వార్డుకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ప్రభుత్వ పథకాలు, వర్తమాన రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి. గతంలో ప్రభుత్వ సంస్థల్లో, ఎన్జీవోల్లో పని చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు మున్సిపల్ కమిషనర్లు నోటీసు బోర్డులో పొందుపరుస్తారు.

పట్టణ వాలంటీర్లకు విద్యార్హత డిగ్రీ నుంచి ఇంటర్
పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల పోస్టులకు మంగళవారం సాయంత్రం వరకు 1.70 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి విద్యార్హత మొదట డిగ్రీగా ఉంది. ఆ తర్వాత ఇంటర్‌కు తగ్గించారు. అలాగే, దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారు. దీంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్న ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వార్డు వాలంటీర్, ఇతర ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తారు. పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల సంఖ్య 81వేలు అవసరమని గుర్తించారు.

బాధ్యతలు.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రజలకు సకాలంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చేలా వార్డు వాలంటీర్లు కృషి చేయాలి. దీనిని నిర్ధారించుకునేందుకు తరుచూ తనిఖీలు ఉంటాయి. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే లేదా అవినీతికి పాల్పడితే సచివాలయాల్లో కో ఆర్డినేటర్ మున్సిపల్ కమిషనర్‌కు నివేదిక అందిస్తారు. అలాంటి వాలంటీర్‌పై చర్యలు ఉంటాయి.

4వేల వార్డు సచివాలయాలు
పట్టణ ప్రాంతాల్లో 4వేల వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తోంది. మరో వారం పది రోజుల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశముంది. ఓ వైపు 81వేల మంది వార్డు వాలంటీర్ల నియామకానికి చర్యలు తీసుకుంటూ మరోవైపు వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించారు. ఏపీలోని 110 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటవుతాయి. ఈ సచివాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అంగన్వాడీ భవనాలు, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ భవనాల్లోని గదుల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలి. ఇవి అందుబాటులో లేకుంటే ప్రజలకు సౌకర్యంగా ఉండేలా ప్రైవేటు భవనంలో ఓ గదిని అద్దెకు తీసుకోవాలి. వార్డు సచివాలయానికి ఫర్నీచర్‌ను ప్రభుత్వం సమకూరుస్తుంది. జనాభా ఆధారంగా వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. కనిష్టంగా 4వేలు, గరిష్టంగా 6వేల జనాభా ఉండాలి. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటారు. జనాభా తక్కువ ఉంటే సమీపంలోని వార్డు సచివాలయానికి అనుసంధానం చేస్తారు.

సిఫార్సులు ప్రారంభమయ్యాయా?
గ్రామ, పట్టణ వాలంటీర్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు, తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకునేందుకు అధికార పార్టీ నాయకులు కొన్నిచోట్ల అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు సూచించిన వారికి అవకాశాలెక్కువ ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇంటర్వ్యూలలో అధికార పార్టీ నేతల చొరవ ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications