చిన్న రియల్టర్లు చితికి పోయారు.. బడా రియల్టీ కంపెనీలదే హవా
చిన్న రియల్టర్లు చితికిపోతున్నారు. గృహ నిర్మాణాలను విడిచిపెట్టి వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు బిల్డర్లమని చెప్పుకునే వారు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఇలాంటి వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణల మూలంగా చిన్న డెవలపర్లు తట్టుకోలేక తమ దందాను వదిలిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఒక్క నగరానికే పరిమితం కాలేదు. దేశంలోని తొమ్మిది నగరాల్లో ఇలాగే ఉంది.

ఎందుకంటే..
* 2011-12 సంవత్సరం నుంచి 2017-18 సంవత్సర మధ్య కాలంలో సగానికి సగం మంది డెవలపర్లు తగ్గిపోయారని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది.
* వీరిలో కొంత మంది బడా బిల్డర్లతో చేతు లు కలపగా మరికొంత మంది తమ వ్యాపారానికి స్వస్తి పలికారు.
* గృహాలకు డిమాండ్ మందగించడం, ప్రభుత్వం ఈ రంగాన్ని నియంత్రించే విధంగా పలు నియంత్రణలు చేయడం వల్ల వాటిని చిన్న బిల్డర్లు తట్టుకోలేక పోయారు.
* చాలా మంది చిన్న డెవలపర్లు నిర్దేశిత సమయంలో ఇళ్లను కొనుగోలు దారులకు ఇవ్వలేక పోయారు. ఫలితంగా ఇలాంటి వారిపై కొనుగోలు దారుల్లో విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది.
* 2011-12 లో హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా, ముంబై, థానే, పూణే , బెంగళూరు, చెన్నై, కోల్‌కతా లో 3,538 మంది డెవలపర్లు ఉండేవారు. 2017-18 సంవత్సరం నాటికీ వీరి సంఖ్య 51 శాతం తగ్గి 1,745కు చేరుకుంది.
* సమీక్ష కాలంలో గురుగ్రామ్, నోయిడా, చెన్నై నగరాల్లో డెవలపర్ల సంఖ్య 70-80 శాతం తగ్గింది. కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ లో 60-65 శాతం మంది డెవలపర్లు తగ్గారు. థానేలో 48 శాతం మంది, ముంబైలో 32 శాతం మంది తగ్గిపోయారు.

మారుతున్న కొనుగోలుదారుల ధోరణి
* ఇళ్లను, అపార్టుమెంట్లను కొనుగోలు చేసే వారి ఆలోచనా ధోరణి మారుతోంది. తాము అనుకున్న సమయానికి ఇంటిని అందించే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే వారిని ఎంచుకుంటున్నారు.
* కాస్త ఎక్కువ మొత్తం చెల్లించినా సరే గాని ఇల్లు మాత్రం ధృడంగా ఉండాలని కోరుకుంటున్నారు.
* బడా కంపెనీలు అన్ని రకాల నియమ నిబంధనలు పాటిస్తున్నాయి. చెప్పిన కాలానికి అపార్ట్మెంట్ ను డెలివరీ చేస్తున్నాయి.
* చిన్న డెవలపర్లు ఇళ్లను కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చెప్పిన సమయానికి ఇంటిని పూర్తి చేయడం లేదు.
* ఇల్లు కొనుగోలు చేయాలంటే రుణం తీసుకోవడం తప్పనిసరి. పెద్ద బిల్డర్లు రుణ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
* అపార్టుమెంట్ల నిర్వహణ విషయంలోనూ పెద్ద కంపనీలు పక్కాగా ఉంటున్నాయి.
* ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పేరున్న కంపెనీలను కొనుగోలుదారులు ఎంచుకుంటున్నారు.

నిబంధనలు కఠినతరం
* రియాల్టీ రంగంలో నల్లధన ప్రవాహం భారీ స్థాయిలో జరుగుతుందని గ్రహించిన ప్రభుత్వం ఈ రంగంలో జరిగే లావాదేవీలపై దృష్టి సారించింది.
* చిన్న డెవలపర్లు ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయలేక పోతున్నారు.
* పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వంటివి చిన్న డెవలపర్లకు శాపంలా మారాయి.


Click it and Unblock the Notifications