రియల్టీ రంగానికి కొత్త ఊపు
పెద్ద నోట్ల రద్దు ఆ తర్వాత వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అనంతరం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) వంటి సంస్కరణల మూలంగా దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ సంస్కరణల ఫలితంగా డెవలపర్ల బాధ్యత, జవాబుదారీ తనం పెరిగింది. ఇళ్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం నిండుకుంది. అయితే కొత్త సంస్కరణల ఫలితంగా ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది. ఇదేసమయంలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంభిస్తూ వచ్చారు. ఫలితంగా ఇళ్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు.
అమ్ముడుపోకుండా నిలిచిపోయిన ఇళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ భారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రియాల్టీ రంగం ప్రభుత్వానికి మొరపెట్టుకోగా గత ఫిబ్రవరి లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో జీఎస్టీ భారాన్ని తగ్గించారు. దీంతో అమ్మకాలు పుంజుకున్నాయి. ఈసారి బడ్జెట్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆందుబాటు ధరల్లో గృహాలు (అఫర్డబుల్ హౌసింగ్) అదనంగా వడ్డీ మినహాయింపు కల్పించారు.

అదనంగా రూ. 1.50 లక్షలు
రుణం ద్వారా రూ. 45 లక్షల లోపు ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఇప్పటిదాకా వడ్డీ రాయితీ రూ. 2 లక్షలుగా ఉంది. ఇప్పుడు దీన్ని రూ.1.50 లక్షలు పెంచారు. కాబట్టి మొత్తం రూ. 3.50 లక్షలకు పెరుగుతుంది. దీంతో గృహాల కొనుగోలుదారుల్లో మరింత ఉత్సాహం నెలకొననుంది. అంతే కాకుండా రూ. 45 లక్షల లోపు ఇళ్లకు డిమాండ్ బాగా పెరగనుంది.

ప్రభావం ఎంత?
* పట్టణాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా సాధారణ వేతన జీవులు, మధ్యస్థాయి వర్గాలు భూములు కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకునే పరిస్థితి లేకుండా పోతోంది. చాలా మంది డెవలపర్లు రూ. 50 లక్షలు అంతకు మించిన ధర కలిగిన ఇళ్లనే నిర్మిస్తున్నారు. అంత సొమ్ము వెచ్చించలేక అనేక మంది సొంతింటి కలలు నెరవేరడం లేదు.
* ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలించిన ప్రభుత్వం రూ. 45 లక్షలలోపు ధర కలిగిన ఇళ్లను కొనుగోలు చేసే వారికీ అదనంగా వడ్డీ మినహాయింపు కల్పించనున్నట్టు ప్రకటించింది. దీనివల్ల ఇళ్లను కొనుగోలు చేసే మధ్యతరగతి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అందరికీ ఇళ్లను కల్పించాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్న ప్రభుత్వం ఈదిశగా చర్యలు తీసుకుంటోంది.

ఉపందుకోనున్న ఉపాధి కల్పన
* వడ్డీ రాయితీని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది డెవలపర్లు ఈ అందుబాటు ధరల్లోని ఎక్కువగా ఇళ్లను నిర్మించే అవకాశం ఉంటుంది.
* ఇలాంటి ఇళ్ల నిర్మాణాలు పెరగడం వల్ల సిమెంటు, స్టీలుకు డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. నిర్మాణ రంగంలోనే కాకుండా ఈ రంగం పై ఆధార పడిన రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అవకాశాలు ఏర్పడనున్నాయి.
* రూ. 45 లక్షల లోపు గృహ నిర్మాణాలపై పెద్ద రియల్ ఎస్టేట్ కంపనీలు అంతగా దృష్టి సారించడం లేదు. కాబట్టి ఈ కంపనీలు ఇప్పుడు అందుబాటు గృహాలపై ఆసక్తి చూపడానికి అవకాశం ఉంటుంది.
* తక్కువ ధరల్లో ఇళ్లను నిర్మించే వారిలో చిన్న డెవలపర్లు ఎక్కువ. వీరిలో చాలా మంది రేరా కింద నమోదు చేసుకోవడం లేదు. కాబట్టి వీరివద్ద గృహాలు కొనుగోలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇల్లు కొనుగోలు చేసేవారు రేరావద్ద నమోదు అయ్యారాలేదా అని చూస్తున్నారు. కాబట్టి డెవలపర్లు తప్పనిసరిగా నమోదు కావాల్సివస్తుంది.
* బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరగనుంది. ఫలితంగా భ్యాంకుల రుణ వితరణలోనూ మంది వృద్ధి నమోదు కావడానికి అవకాశాలు ఏర్పడనున్నాయి.


Click it and Unblock the Notifications