న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీలకు సంబంధించి ఏపీకి రూ.1,174 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. స్మార్ట్ సిటీ, ఆకర్షణీయ పట్టణాలకు సంబంధించి టీజీ వెంకటేష్, రవీంద్ర కుమార్‌లు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం చెప్పారు. ఏపీలో ఏ నగరానికి ఎంత మొత్తం ఇచ్చామో కూడా వెల్లడించారు.

ఏపీ స్మార్ట్ సిటీలకు రూ.1,174 కోట్లు విడుదల
స్మార్ట్ సిటీ కింద విశాఖపట్నంకు రూ.294 కోట్లు, తిరుపతికి రూ.196 కోట్లు, కాకినాడకు రూ.294 కోట్లు, ఏపీ రాజధాని అమరావతికి రూ.390 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం రూ.1,174కోట్లు విడుదల చేశామని తెలిపారు. అలాగే, ఏపీలోని 33 పట్టణాల్లో అమృత్ స్కీంను అమలు చేస్తున్నామన్నారు. రూ.2,890.17 కోట్లతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించామన్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.1,056.62 కోట్లు అని తెలిపారు.

హైదరాబాద్, విజయవాడ నుంచి డిజి యాత్ర
ఈ ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్, విజయవాడ సహా పలు నగరాల్లో డిజి యాత్ర అందుబాటులోకి తేనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. కోల్‌కతా, వారణాసి, పుణే, బెంగళూరు, కొచ్చి, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలకు కూడా అందుబాటులోకి తేనున్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణీకులు ప్రతి గేటు వద్ద టిక్కెట్, గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా నేరుగా విమానం వద్దకు చేరుకునే వెసులుబాటు ఉంటుంది.

ఏపీ, తెలంగాణలకు రూ.14వేల కోట్లు
ఇదిలా ఉండగా గ్రాంట్ల రూపంలో 14వ ఆర్థిక సంఘం 2015-16 నుంచి 2019-20 వరకు ఏపీ పంచాయతీలకు రూ.8,654 కోట్లు, తెలంగాణ పంచాయతీలకు రూ.5375 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ఇటీవల తెలిపింది. తలసరి సాయం రూ.488 చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద జూన్ 2019 వరకు కృష్ణా జిల్లాలో 5,540 ఇళ్లు నిర్మించామని, ఈ పథకంలో భాగంగా 2018-19కి గ్రామీణ పథకంలో రూ.186.05 కోట్లు, అర్బన్ పథకంలో రూ.6,153 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పోలీసు బలగాల ఆధునికీకరణకు 2019-20కి గాను రూ.41.94 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఏపీకి రూ.24.46 కోట్లు, తెలంగాణకు రూ.17.48 కోట్లు ఇచ్చారు.


Click it and Unblock the Notifications