తెలుగు విద్యార్థులకు గుడ్‌న్యూస్: ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ పరీక్షలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు 2019 ఆర్థిక సర్వేను గురువారం పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఇందులో బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త. ఇక నుంచి బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రకటించారు. IBPS రీజినల్ రూరల్ బ్యాంకు పరీక్షలు ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది. స్కేల్ 1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలను ఈ భాషల్లో నిర్వహిస్తారు.

ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ పరీక్షలు
ప్రస్తుతం ఈ పరీక్షలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే రాసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదన వల్ల ప్రాంతీయ భాషల్లో చదువు పూర్తి చేసిన వారికి పరీక్ష రాయడం ఎంతో సులభం కానుంది. ఇదివరకు ఆయా ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్షలు రాయడం కష్టంగా ఉండేది. టాలెంట్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్, హిందీ సరిగ్గా అర్థం కాని వారు ఈ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ భాషల్లో చదివిన అభ్యర్థులకు ఎంతో మేలు జరగనుంది. మన వద్ద తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలు నిర్వహించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు ప్రయోజనకరం.

తెలుగు విద్యార్థులకు శుభవార్త
ప్రాంతీయ భాషల్లోను బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించాలని దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి డిమాండ్ వచ్చింది. దక్షిణాది ఎంపీలు ఈ డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తెలుగులో కూడా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాంతీయ భాషల్లో చదివే వారికి ఇది గొప్ప శుభవార్త.

ఏయే భాషల్లో పరీక్షలు?
IBPS పరీక్షలు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇక నుంచి అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నట, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడిశా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని లేదా రాష్ట్రాల్లోని ప్రాంతీయ యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.


Click it and Unblock the Notifications