మేడిన్ ఏపీ: ఆగస్ట్ 1 నుంచి కియా కార్లు రెడీ!
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లాలో తయారయ్యే కియా కార్లు రోడ్ల పైకి దూసుకు వెళ్లనున్నాయి. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి వాణిజ్యపరంగా కార్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ నెల చివరలోనే ఉత్పత్తి ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యే తీరిక ఉండదు. ఈ నేపథ్యంలో ఈ మేడిన్ ఏపీ కార్లు ఆగస్ట్ ఒకటే తేదీన ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రారంభం నుంచి వీలైనంత ఎక్కువగా ఉత్పత్తి చేయాలని కియా భావిస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన కియా తన ప్లాంట్ నిర్మాణ పనులను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసింది. అనంతపురం - బెంగళూరు రహదారిలో ఈ పరిశ్రమ ఉంది. దీనికి అనుబంధంగా ఉండే పరిశ్రమలు ఇక్కడకు తరలి వచ్చాయి. దీంతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. 75 శాతం స్థానికులకు ఇవ్వాలి.

కియా మోటార్స్ తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ఏపీకి వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థ నుంచి ఈ ఏడాది జనవరిలో తొలి కారును విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 2017లో నిర్మాణం ప్రారంభించి జనవరి నాటికి ట్రయల్ ప్రొడక్షన్ స్థాయికి చేరుకుంది. కియా సహా పలు దిగ్గజ కంపెనీలను ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు.
కాగా, కియా మోటార్స్ దేశంలో తొలి షోరూంను యూపీలోని నోయిడాలో ఏర్పాటు చేసింది. అనంతపురం ప్లాంట్‌లో ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. దేశాయ మార్కెట్లో విక్రయించేందుకు వీలుగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగా ఏపీలో సొంతగా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.


Click it and Unblock the Notifications