జియో యూజర్లకు గుడ్‌న్యూస్, ప్రతి శనివారం 10 భాషల్లో ట్రెయినింగ్
అందరు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిజిటల్ లిటరసీ ఇనిషియేటివ్‌లో భాగంగా డిజిటల్ ఉడాన్ పేరుతో డిజిటల్ అవగాహన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. డిజిటలైజేషన్‌కు అనుగుణంగా టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తుంది. గతంలో డిజిటల్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చిన జియో ఇంటర్నెట్ ఫస్ట్ టైమ్ ఇంటర్నెట్ యూజర్ల కోసం తాజా కార్యక్రమం చేపట్టింది.

ఫేస్‌బుక్‌తో కలిసి..
ఇందుకోసం జియో... సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో కలిసి పని చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక మ్యాడ్యూల్ రూపొందించింది. జియో డిజిటల్ ఉడాన్‌లో భాగంగా ప్రతి శనివారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో జియో ఫోన్ ఫీచర్స్, వివిధ రకాల యాప్స్ వినియోగం, ఇంటర్నెట్ భద్రత, జియో ఫోన్ ఫేస్‌బుక్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో టచ్‌లో ఉండటం వంటి పలు అంశాలపై శిక్షణ ఇస్తారు.

పది భాషల్లో ఆడియో విజువల్ ట్రెయినింగ్
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యూజర్లను దృష్టిలో పెట్టుకొని, అక్కడ కూడా పాగా వేసేందుకు డిజిటల్ ఉడాన్‌ను తీసుకు వచ్చింది జియో. పది ప్రాంతీయ భాషల్లో ఆడియో విజువల్ ట్రెయినింగ్ ఉంటుంది. 13 రాష్ట్రాల్లో దాదాపు 200 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కోట్లాదిమంది జియో ఫోన్ వినియోగదారులను ఇంటర్నెట్ వినియోగంలో మరింత పటిష్టం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జియో ఫోన్ వినియోగదారులు, ఫస్ట్ టైమ్ ఇంటర్నెట్ యూజర్లకై దీనిని త్వరలో 7,000 ప్రాంతాలకు విస్తరిస్తారు.

ఇదే లక్ష్యం..
సమాచారం, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్... ఏదైనా డిజిటలైజేషన్ భారతీయులందరికీ చేరువ కావాలని, జియో దీనిని ప్రతి నగరానికి, గ్రామానికి తీసుకు వెళ్తుందని, దేశంలో 100 శాతం డిజిటల్ అక్షరాస్యతను సాధిస్తామని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ అన్నారు. ప్రస్తుతం జియోకు 30 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ఇందులో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగించే వారు ఉన్నారు.

జియో ఇనిస్టిట్యూట్ కోసం పెట్టుబడులు
ఇదిలా ఉండగా, రానున్న రెండేళ్లలో జియో ఇనిస్టిట్యూట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ అంశంపై ఇప్పటికే ఎంపవర్డ్ ఎక్స్‌పర్ట్ కమిటీ (EEC)కి సమాచారం ఇచ్చింది. మరోవైపు, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని గ్రూప్.. స్టాంఫర్డ్ యూనివర్సిటీ, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలలోని నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications