ఆర్థిక సర్వేపై ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత చిదంబరం స్పందన
న్యూఢిల్లీ: ఈ రోజు (జూలై 4) పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. భారత్ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలకు రూపునిచ్చేలా ఇది ఉందని ప్రధాని అన్నారు. అయుదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారాలని దేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక సర్వే 2019 రూపును ఇస్తుందని చెప్పారు. మరోవైపు, చిదంబరం ఆర్థిక సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం నిరాశావాదంతో ఉన్నట్లుగా కనిపిస్తోందని చిద్దూ అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 2018-19 ఎనకామిక్ సర్వేను ప్రవేశ పెట్టారని, ఇందులో మోడీ తొలి ప్రభుత్వంపై (2014-2019) ప్రశంసలు ఉన్నాయని, కానీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 7గా ఉందని, అలాగే రంగాల వారిగా గ్రోత్ రేటు గురించి లేదని చెప్పారు.

ఆర్థిక సర్వేలో వృద్ధి రేటు మందగించడం, రెవెన్యూ షార్ట్‌ఫాల్ వంటి అంశాలు ఆందోళన కలిగించేవిగా పేర్కొన్నారు. ఏది కూడా పాజిటివ్‌గా లేదన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పట్ల నిరాశావాదంతో ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఆర్థిక సర్వేపై రణ్‌దీప్ సుర్జేవాలా కూడా పెదవి విరిచారు.
కాగా, దేశం 2024-25నాటికి అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి, వృద్ధి రేటు ఇప్పటి నుంచే ఎనిమిది శాతం దాటాలని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇప్పటికే పలు సార్లు మోడీ తెలిపారు. పెట్టుబడుల రేటు పెరిగే అవకాశాలు, వృద్ధిరేటులో మందగమనం, జీఎస్టీ, ప్రభుత్వ పథకాలు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి అంశాలను ఇందులో వివరించారు. భారత్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం పెట్టుబడుల వాతావరణాన్ని పెంచుతుందన్నారు.


Click it and Unblock the Notifications