రియల్ ఎస్టేట్‌లో టాప్: హైదరాబాద్‌లో ఇక్కడే డిమాండ్, 6 శాతం పెరిగిన ధరలు
హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాదులోనే ధరలు చౌకగా ఉన్నాయనే విషయం తెలిసిందే. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా ఊపందుకుంటోందట. రీజనబుల్ రియల్ ఎస్టేట్ ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి రానున్న రోజల్లో మరింత ఊతమిస్తాయని క్రెడాయ్ హైదరాబాద్ చెబుతోంది. రియల్ రంగం వేగంగా పెరుగుతోందని, దీనిని మరింత పెంచేందుకు సింగిల్ విండో అప్రూవల్స్ అమలును వేగవంతం చేయాలని కోరుతున్నారు.

30 శాతం వృద్ధి
రెసిడెన్షియల్ సెక్టార్‌లో హైదరాబాదులో 30 శాతం వృద్ధి కనిపించిందని క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షులు రామకృష్ణా రావు తెలిపారు. ఆఫీస్ స్పేస విభాగంలో బెంగళూరును దాటిందన్నారు. తెలంగాణ రియల్ రంగంలో సింగిల్ విండో విధానం అమలు చేస్తే నిర్మాణ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా అవుతుందన్నారు. దక్షిణాదిలోనే హైదరాబాద్ రియల్ రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

హైదరాబాదులో ఇళ్ల రేట్లు 6 శాతం పెరిగాయి
తాజాగా, ఇళ్ల అమ్మకాల్లో దేశంలోనే హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. 2019 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్లాట్ల అమ్మకాల్లో భాగ్యనగరం ఇతర నగరాలను వెనక్కి నెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ లోపు నగరంలో దాదాపు 65 శాతం వృద్ధిని నమోదు చేయగా, జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్‌లు నిలిచాయి. వెస్ట్ హైదరాబాద్‌లో నివాస సముదాయాలకు ఎక్కువ గిరాకీ ఉందని ఈ నివేదిక తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇళ్ల రేట్లు ఆరు శాతం పెరిగాయి.

ఇది తాత్కాలిక ఆందోళన
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రాజెక్టులు సాధారణంగానే ఉన్నప్పటికీ, విక్రయాలు మాత్రం బాగా నమోదయ్యాయి. కొత్త నివాస సముదాయాల ప్రాజెక్టులు ప్రారంభం కాకపోవడమే హైదరాబాద్ రియల్ రంగానికి తాత్కాలిక ఆందోళనకర అంశమని జేఎల్ఎల్ పేర్కొంది. ఈ ఏడాది ప్రథమార్థంలో 50 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. 2018 ఆగస్టులో రెరా అమల్లోకి రావడం, అసెంబ్లీ ఎన్నికలు, ఎక్కువ సంస్థలు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాలు పేర్కొంది.

పశ్చిమలో అధికం.. తూర్పువైపు దృష్టి
పశ్చిమ హైదరాబాదులో గత ఆరు నెలల్లో ఎక్కువ ప్రాజెక్టులు, విక్రయాల జోరు కనిపించింది. మెట్రో రైలు కారణంగా ఇప్పుడిప్పుడే తూర్పు భాగ్యనగరం వైపు దృష్టి సారిస్తున్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు మరిన్ని రానున్నాయని జెఎల్ఎల్ వెల్లడించింది. నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్స్ వంటివి పెరిగితే చుట్టుపక్కల మరింత గిరాకీ ఉంటుందని తెలిపింది.

జీఎస్టీ తగ్గింపు కూడా రియల్ డిమాండ్‌కు కారణం
అందబాటులో, మధ్యాదాయ గృహాల వాటా దేశవ్యాప్తంగా 58 శాతం పెరగగా, హైదరాబాదులో ఇది 28 శాతంగానే ఉంది. పుణేలో మొత్తం ప్రాజెక్టుల్లో ఈ వాటా 90 శాతానికి పైగా ఉంది. పుణే, చెన్నై, బెంగళూరులో అత్యధికంగా అందుబాటు, మధ్యస్థాయి ధరల్లో గృహాలు ఉన్నాయి. వీటి విలువ ముంబైలో రూ.1 కోటి అయితే, ఇతర నగరాల్లో రూ.75 లక్షలు. కాగా, జీఎస్టీని 8 శాతం నుంచి 1 శాతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించింది. రియల్ డిమాండ్ పెరగడానికి ఇది ప్రధాన కారణమని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications