రేపు లోకసభ ముందుకు ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు కీలక ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ గురువారం (జూలై 4) లోకసభలో ప్రవేశ పెట్టనున్నారు. కొత్త ప్రభుత్వంలో తొలి ఆర్థిక సర్వేను తొలిసారిగా రేపు సభలో ప్రవేశ పెట్టేందుకు ఎదురు చూస్తున్నానని ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను లోకసభలో ప్రవేశపెడతారు. అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థపై అంచనాలు, వ్యవసాయం, ఉద్యోగాలు తదితర అంశాలను ఈ సర్వే ద్వారా వెల్లడిస్తారు. ఎల్లుండి (జూలై 5) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఆర్థిక సర్వేను ప్రవేశ పెడుతున్నారు.

గడిచన ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాల ఫలితాలు వంటివి చెప్పేదే ఆర్థిక సర్వే. దీని ఆధారంగా బడ్జెట్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. ఈ నివేదికను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సిద్ధం చేస్తారు.
కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన ఆయా రంగాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను అంశంలోను ముఖ్యంగా ఐదు మార్పులు ఉంటాయని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపులు పెంచేందుకు ఈ బడ్జెట్‌లో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం సెక్షన్ 80సీ, సెక్షన్ 80 డి వంటి రాయితీలను ప్రకటించినా ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఇవి సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications