మన బడ్జెట్ సృష్టికర్త ఎవరో తెలుసా?
బడ్జెట్... బడ్జెట్.... బడ్జెట్.... మరో సారి దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. తమకు ఏమైనా మినహాయింపులు వస్తాయా అని వేతన జీవులు, వస్తు సేవల ధరలు తగ్గుతాయా అని మధ్య తరగతి ప్రజలు... జీఎస్టీ తగ్గిస్తారా అని వ్యాపార వర్గాలు, ట్యాక్స్ తగ్గుతుందా అని కార్పొరేట్ కంపెనీలు, రుణ మాఫీ ఉంటుందా అని రైతులు వేచి చూసే తరుణమిది. బడ్జెట్ ప్రతి ఏటా ప్రవేశ పెట్టేదే ఐనా ఈ సారి కొన్ని కొత్త అంశాలు ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. మొట్ట మొదటి సారి ఒక పూర్తిస్థాయి మహిళా ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టడం తో పాటు, అఖండ మెజారిటీ తో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా నేతృత్వంలోకి ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే మెరుగైన పథకాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, అసలు భారత దేశం లో బడ్జెట్ ఎవరు రూపొందించారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనే విషయాలు చాల మందికి తెలియక పోవొచ్చు. అలంటి వారికోసమే ఈ ప్రత్యేక వ్యాసం.

అవిభాజ్య భారత్ కోసం బడ్జెట్
ఇంగ్లాండ్ దేశంలోని స్కాట్లాండ్‌కు చెందిన జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి మొట్టమొదటి సరి అవిభాజ్య భరత్ కోసం బడ్జెట్ ను రూపొందించారట. 1860 వ సంవత్సరంలో ఆ బడ్జెట్ను తొలిసారి ప్రవేశపెట్టారట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు, ది ఎకనామిస్ట్ మ్యాగజిన్ వ్యవస్థాపకుడు కూడా ఈయనే కావడం విశేషం.
అయితే, టోపీలు తయారు చేసే జేమ్స్ విల్సన్ కాలక్రమం లో ఆర్థికాంశాలపై పట్టు సాధించారట. క్రమంగా ఎదుగుతూ వైస్రాయ్ లార్డ్ కౌన్సిల్ లో సభ్యుడుగా చేరారట. అదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్ ఫైనాన్స్ సెక్రటరీ గా, బోర్డు అఫ్ ట్రేడ్ వైస్ ప్రెసిడెంట్ గానూ తన సేవలు అందించారు.

జేమ్స్‌కు బాధ్యతలు...
1859 లో తొలిసారి భారత్ లో అడుగు పెట్టిన జేమ్స్ కు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసే బాధ్యతను అప్పగించింది. భారత్ లో సిపాయి తిరుగుబాటు జరిగి తోలి స్వాతంత్ర్య పోరాటం ప్రారంభం కావడం తో బ్రిటిష్ ప్రభుత్వం అధిక నిధులను మిలిటరీ కోసం ఖర్చు చేయటం తో ... నిధులకు కటకటా ఏర్పడిందట. అప్పుల్లో మునిగిన ప్రభుత్వానికి సరైన ఆడ్డాయా వనరులను తెచిపెట్టేందుకు బడ్జెట్ రూపొందించాల్సి వచ్చింది.
తన మేధస్సుకు పదును పెట్టిన జేమ్స్ విల్సన్... బ్రిటిష్ వారి మిలిటరీ, రాజకీయ అవసరాల కోసం దెబ్బతిన్న ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు రూపొందించి, ప్రవేశ పెట్టిందే ... మన మొట్ట మొదటి బడ్జెట్ ఐంది.

మోడీ ఏం చేస్తారు..
అలాగే, పన్ను వసూళ్లు పెంచేందుకు ఆయన రూపొందించిన ఆదాయ పన్ను చట్టం 1860 కూడా ఇప్పటి వరకు కొన్ని మార్పు చేర్పులతో అలాగే కొనసాగుతుండటం కొసమెరుపు. అప్పట్లోనే జేమ్స్ అమల్లోకి తెచ్చిన ఆదాయ పన్ను చట్టం పై జమీందారులు, సంపన్న వర్గాలు పెదవి విరిచాయట. పన్ను ఎగవేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించారట. అది ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం.
సో, ఎప్పుడో 1860 లో ఒక బ్రిటిష్ పౌరుడు రూపొందించిన బడ్జెట్, అలాగే ఆదాయ పన్ను చట్టం అమలు చేస్తారా... లేదంటే భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతనని కంకణం కట్టుకొన్న ప్రధాని మోడీ ... గుణాత్మకమైన మార్పులు తెస్తారా అన్నది రానున్న బడ్జెట్ ద్వారా తేలిపోతుందేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications