గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర, రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: గృహ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఈ రోజు నుంచి రూ.100 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సిలిండర్ ధర జూలై 1వ తేదీన రూ.737.50 నుంచి రూ.637కు తగ్గింది. ఎల్పీజీ సిలిండర్ ఉపయోగించే వారికి ఇది పెద్ద ఊరట.
నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు రూ.737గా ఉండగా, జూలై 1 నుంచి రూ.637గా ఉండనుంది. సబ్సిడీ సిలిండర్ రేటు రూ.494.35కు దిగి రానుంది. మిగిలిన రూ.142.35 లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. సబ్సిడీ మొత్తం ప్రతి నెల బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు దిగి రావడం, అమెరికన్ డాలర్‌తో ఇండియన్ రూపాయి మారకం విలువ సానుకూలంగా ఉండంతో ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
ముంబైలో సబ్సిడీలేని ఎల్పీజీ ధర రూ.608.50, చెన్నైలో రూ.652.50, కోల్‌కతాలో రూ.662.50గా ఉంది. సబ్సిడీ ఎల్పీజీ ధర ఢిల్లీలో మూడు రూపాయలు తగ్గించి రూ.494.35, ముంబైలో రూ.497.37, చెన్నైలో రూ.482.23, కోల్‌కతాలో రూ.497.47గా ఉంది.
ఎల్పీజీ వినియోగదారులు గ్యాస్‌ను మార్కెట్ రేటుకే కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ఏడాదికి ఒక్కో కుటుంబానికి 14.2 కేజీల బరువు గల 12 సిలిండర్లను ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. ఈ రాయితీ నగదు బ్యాంకు అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications