ఇన్వెస్టర్లలో అందరూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది చాలా డేర్ చేసి ఈక్విటీ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెడతారు. మార్కెట్లో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నాగాని పెట్టుబడుల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తుంటారు. భారీగా సొమ్ము కూడబెట్టుకోవడానికి అదే సమయంలో అదే స్థాయిలో నష్టపోవడానికి వెనుకాడరు. మరికొందరు తమ పెట్టుబడులపై లాభాలు రాకపోయినా గాని అసలుకు ఎసరు రాకుండా చూసుకుంటారు. ఇంకొంత మంది మాత్రం తమ పెట్టుబడులు చెక్కు చెదరకుండా ఉండటంతో పాటు రాబడులు రావాలను కుంటారు. ఇలాంటి వారు హైబ్రిడ్ ఫండ్స్ ను ఎంచుకుంటారు. వీటి గురించి తెలుసుకుంటే మీరుకూడా వీటిలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఆ వివరాలు మీ కోసం...
పెట్టుబడులు ఇలా...
* హైబ్రిడ్ ఫండ్స్.. డెట్ సాధనాలతో పాటు ఈక్విటీల్లో పెట్టుబడులు పెడతాయి. పెట్టుబడుల వివిధీకరణకు ప్రాధాన్యం ఇస్తాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సొమ్ముకు రిస్క్ తక్కువగా ఉండి రిటర్న్ లు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. మనం తీసుకునే రిస్క్, పెట్టుబడుల లక్ష్యాలను బట్టి హైబ్రిడ్ ఫండ్స్ ఎంపిక ఆధారపడి ఉంటుంది.
* బ్యాలన్సుడ్ పోర్ట్ ఫోలియో ద్వారా దీర్ఘకాలంలో సంపద పెంచడం, స్వల్పకాలంలో ఆదాయాన్ని వృద్ధి పరచడం ఈ హైబ్రిడ్ ఫండ్స్ లక్ష్యం. ఫండ్ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా మీ సొమ్మును ఫండ్ మేనేజర్ ఈక్విటీ, డెట్ లో పెట్టుబడి పెడతాడు. మార్కెట్ కదలికలకు అనుగుణంగా మీ ఫండ్ మేనేజర్ సెక్యూరిటీల క్రయవిక్రయాలు సాగిస్తుంటాడు.

ఎవరు పెట్టుబడులు పెట్టవచ్చంటే...
ఈక్విటీ ఫండ్స్ కన్నా హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుబడులు కొంత భద్రతతో కూడుకున్నవిగా చెప్పవచ్చు. డెట్ ఫండ్స్ కన్నా ఎక్కువగా ఇవి రిటర్న్ లను ఇస్తుంటాయి. ఈక్విటీ మార్కెట్లోకి ప్రవేశించాలనుకునే ఇన్వెస్టర్లు ముందు ఈ ఫండ్స్ ను ఎంచుకోవడం బెటర్ అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఫండ్స్ లో ఈక్విటీ, డెట్ ఉంటుంది కాబట్టి మార్కెట్ జోరుగా ముందుకు సాగితే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ పనితీరు సరిగా లేకపోతే డెట్ విభాగం ద్వారా ఊరట లభిస్తుంది. ఫలితంగా స్థిర రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది.
ఇవీ రకాలు
హైబ్రిడ్ ఫండ్స్ లోను పెట్టుబడుల కేటాయింపులో ప్రాధాన్యతలు ఉంటాయి. ఇవి ఎంచుకున్న ఫండ్స్ ను బట్టి ఉంటాయి.
* ఈక్విటీ ఓరియెంటెడ్ హైబ్రిడ్ ఫండ్స్
ఇందులో ఫండ్ మేనేజర్ ఫండ్స్ లో 65 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఈక్విటీలో , మిగతా మొత్తం డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు. అందుకే దీనిని ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్ అంటారు. ఈక్విటీ ఫండ్ లో విభిన్న రకాలకు చెందిన కంపెనీల ఈక్విటీ షేర్లు ఉంటాయి.
*డెట్ ఓరియెంటెడ్ ఫండ్స్
ఇందులో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీలు, డిబెంచర్లు, బాండ్లు, ట్రెజరీ బిల్స్ వంటి స్థిర ఆదాయ సాధనాల్లో పెట్టుబడి పెడతారు. ఇందులో డెట్ సాధనాల కోసం 60 శాతం అంతకన్నా ఎక్కువగా కేటాయిస్తారు. మిగతా మొత్తాన్ని ఈక్విటీకి కేటాయింపు జరుగుతుంది.
* బ్యాలెన్సుడ్ ఫండ్స్
ఇందులో భాగంగా 65 శాతం సొమ్మును ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు.
* ఆర్బిట్రేజే ఫండ్స్
ఇందులో భాగంగా ఆర్బిట్రేజ్ ఫండ్ మేనేజర్ ఒక మార్కెట్లో తక్కువ ధరలో షేర్లను కొని మరో మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తాడు. అయితే ఇది అంత సులభమైన విషయమేమి కాదు. ఒకవేళ ఆర్బిట్రేజ్ కు అవకాశం లేకపోతే డెట్ సాధనాలు లేదా నగదుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.


Click it and Unblock the Notifications