ఆరోగ్య బీమా నేటి కాలంలో అత్యంత కీలకంగా మారిపోయింది. అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీని వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబానికంతటికీ తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏదైనా ఒక బీమా సంస్థ వద్ద పాలసీని తీసుకున్న తర్వాత ఆ బీమా కంపెనీ సర్వీసులు నచ్చకపోయినా క్లెయిమ్ విషయంలో ఇబ్బందులుపెట్టినా వాటిని తట్టుకుంటూ తమ బీమా ప్రీమియంను చెల్లించాల్సిన పరిస్థితులు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీరు బీమా పాలసీ తీసుకున్న సంస్థకు సంబంధించిన సేవలు నచ్చకపోతే మరో కంపెనీకి మారిపోయే (పోర్టబిలిటీ) సదుపాయం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చాలా సులభంగా మీకు నచ్చిన ఆరోగ్య బీమా కంపెనీకి మారిపోవచ్చు. ఈ సదుపాయం ఎంతో మంది బీమా పాలసీదారులకు ఊరట కల్పిస్తోంది.

పోర్టబిలిటీని ఎంచుకోవడానికి కారణం
ప్రస్తుత బీమా కంపెనీ సర్వీసులు బాగుంటే పోర్టబిలిటీ ద్వారా మరో కంపెనీకి తన ఆరోగ్య బీమా పాలసీని బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏయే సందర్భాల్లో పాలసీని బదిలీ చేసుకోవాల్సివస్తుందంటే...
* పాలసీదారుకు అందించే సేవలు అధ్వాన్నంగా ఉన్నప్పుడు
* క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో జాప్యం జరగడం
* హాస్పిటల్లో బిల్లు చెల్లించిన తర్వాత దాని రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేస్తే చెల్లింపులు చేయడం అలసత్వం ప్రదర్శించడం
* ఒకసారి క్లెయిమ్ చేసుకున్న తర్వాత మరుసటి సంవత్సరం బీమా ప్రీమియం మొత్తాన్ని పెంచడం
* పారదర్శకత లేకుండా నిబంధనలు విధించడం
* ఆస్పత్రిలో చేరినప్పుడు గది అద్దె విషయంలో పరిమితులు ఉండటం
* ప్రస్తుత కంపెనీకన్నా తక్కువ ధరలో మరో కంపెనీ పాలసీని అందిస్తున్నప్పుడు పోర్టబిలిటీనీ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

ప్రయోజనాలు
* పోర్టబిలిటీ సందర్బంగా పాలసీదారు తన ప్రస్తుత పాలసీలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అదనపు కవరేజీని ఎంచుకోవచ్చు. అవసరమైతే నామినీని మార్చుకోవచ్చు.
* బీమా కంపెనీల మధ్య పోటీ ఉన్నందువల్ల ఇంతకు ముందున్న పాలసీలోని ప్రయోజనాలనే కొత్త కంపెనీ కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పోర్టబిలిటీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు.
* కుటుంబ, వ్యక్తిగత పాలసీలను బదిలీ చేసుకోవచ్చు.
* పాలసీ బదిలీ కోసం ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఈ అంశాలపై దృష్టిపెట్టాలి
* పాలసీదారుడు పోర్టబిలిటీని ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీ పాలసీ రెన్యువల్ సమయంలోనే మరో కంపెనీకి మారడానికి అవకాశం ఉంటుంది. అంటే పాలసీ రెన్యూవల్ వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది.
* పోర్టబిలిటీ తర్వాత ప్రీమియం మారవచ్చు. అయితే ఇందుకు తగిన విధంగా ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి.
* మరో కంపెనీకి మారేటప్పుడు ఇప్పుడున్న పాలసీ ఉన్న కేటగిరీకే మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు రీఇంబర్స్మెంట్ పాలసీ అయితే అదే పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
* మీరు మరో కంపెనీకి మారాలనుకున్నప్పుడు ప్రస్తుత బీమా కంపనీకి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పాలసీ గడువు ముగియడానికి నెలన్నర ముందుగా ఈ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications